మాదిగజాతికి మరపురాని రోజు!

modi-mandakrishna.jpg

మాదిగదండోరా సభలో మోడీ. ఎన్నికల వేళ ఎవరి ఊహకీ అందని దృశ్యమిది. వచ్చామా వెళ్లామా అన్నట్లు లేదు మాదిగ విశ్వరూప సభ. మూడు దశాబ్దాల ఉద్యమ కలని సాకారం చేసే సంకేతాలిచ్చింది. భావోద్వేగ దృశ్యాలను ఆవిష్కరించింది. ప్రభుత్వాలు మొండికేసినా, తమ డిమాండ్‌కి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోయినా అలుపెరగకుండా తన జాతి గొంతుకని వినిపించిన మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీని తప్ప మరే పార్టీని నమ్మలేమని ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం కొంచెం ఓ వైపే మొగ్గి ఉండొచ్చుగాక. కానీ తమ జాతి ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించేందుకు మాదిగలంతా కదిలివచ్చిన ఆ వేదికకు ప్రధాని హాజరుకావడం అనేది తప్పకుండా ప్రత్యేకమైన విషయం. మోడీకి రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పడిపోయిన సమయంలో కీలకమైన ఓట్ల వర్గంగా ఉన్న మాదిగలను మెప్పించే ప్రయత్నమే కావచ్చు. కానీ ఆ భావోద్వేగాన్ని అత్యంత నేర్పుగా ఒడిసి పట్టుకున్నారు ప్రధాని మోడీ.

మందకృష్ణ కన్నీటిపర్యంతం కావడం, మోడీ ఆయన్ని గుండెలకు హత్తుకుని ఓదార్చడం ఇవన్నీ మాదిగ సామాజికవర్గాన్ని కదిలించాయి. తమ సమస్యకో పరిష్కారం దొరకబోతోందన్న ఆశని కల్పించాయి. మరి ఇదంతా బీజేపీకి రాజకీయంగా కలిసొస్తుందో లేదో ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. కానీ మాదిగల సుదీర్ఘకాల డిమాండ్‌పై ఆలస్యంగానైనా కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టినట్లే కనిపిస్తోంది. షెడ్యూల్డ్‌ కులాల(SC)కు కల్పిస్తున్న రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341ని సవరించాల్సి ఉంటుంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించడంలో తెగువ చూపిన బీజేపీ(NDA) సర్కారుకు అదేం పెద్ద పనికాబోదు. అయితే అంతా తన నెత్తిన వేసుకోకుండా రాష్ట్రాల జోక్యాన్ని కేంద్రం కోరుకుంటోందన్న సంకేతాలున్నాయి. నేరుగా జాతీయస్థాయిలోనే వర్గీకరణ చేపట్టకుండా రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టే వెసులుబాటు కల్పించాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది.

దేశమంతా సామాజిక సమీకరణాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఎస్సీల జనాభానే లేదు. అందుకే రాష్ట్రాల స్థాయిలోనే షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణకు అవకాశమిచ్చేలా కేంద్రం చొరవచూపాలనుకుంటోంది. ఈ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదిలినా తేనెతుట్టెని కదిపినట్లేనని కేంద్రానికి తెలుసు. ఎందుకంటే ఎస్సీల మాదిరిగానే ఎస్టీల్లో కూడా వర్గీకరణ డిమాండ్‌ ఉంది. ఆదివాసీల ప్రయోజనాలను మైదానప్రాంత గిరిజనులు ఎగరేసుకునపోతున్నారన్న అసంతృప్తి ఎప్పట్నించో ఉంది. తెలంగాణలోనే చూసుకుంటే ఆదివాసీలు, లంబాడాల మధ్య దీనిపై పరోక్షయుద్ధం నడుస్తోంది. ఓ రకంగా ఆ సమస్య నివురుగప్పిన నిప్పులా ఉంది. అందుకే ఏ రాష్ట్రంలో వర్గీకరణ అవసరం అనుకుంటే ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం చేసుకునేలా రాజ్యాంగంలోని 341వ అధికరణాన్ని కేంద్రప్రభుత్వం సవరించే అవకాశం ఉంది.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నా అది ఉద్యమరూపం దాల్చింది మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) పేరుతో మందకృష్ణ మాదిగ చేపట్టిన ఈ ఉద్యమం అలుపెరగకుండా దశాబ్ధాలుగా కొనసాగుతోంది. పదవుల కోసం రాజీపడకుండా, ఉద్యమ వేడి తగ్గకుండా చూడటంలో మంద కృష్ణ విజయం సాధించారనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ వస్తున్న మందకృష్ణ మాదిగ విశ్వరూప ప్రదర్శన సభకు ఏకంగా ప్రధానమంత్రిని రప్పించడం చిన్న విషయమేమీ కాదు. ప్రధాని వర్గీకరణ సమస్యపై స్పందించక తప్పని పరిస్థితి కల్పించడం మాదిగజాతి సాధించిన విజయం.

ఉమ్మడి రాష్ట్రంలోనే 2004లో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చినా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దాన్ని కొట్టేసింది. 2006-07లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల వర్గీకరణ అంశంపై ఉషా మెహ్రా కమిటీని ఏర్పాటు చేసింది. 2020లో ఈ ఆంశంపై స్పందించిన సుప్రీం ధర్మాసనం వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి వర్గీకరణ అంశాన్ని అప్పగించాలని సూచించింది.

1994లో హర్యానా, 2006లో పంజాబ్, 2008లో తమిళనాడు రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రయత్నించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నాటకలో అప్పటికి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం తీర్మానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏడు రాష్ట్రాలు స్పందించాయి. 14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. సమస్య జటిలంగా మారకముందే వర్గీకరణకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం చూపించిన చొరవ రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతుందో, చిత్తశుద్ధితో కార్యరూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది.

Share this post

submit to reddit
scroll to top