ఆరడుగులు లేడు. సిక్స్‌ప్యాక్ ఫిజిక్ కాదు. అయితేనేం దశాబ్ధాలపాటు మన వెండితెరపై చందమామలా వెలుగొందాడు. ప్రతీ హీరోయిన్‌కీ లక్కీ హీరో తనే. అందుకే ఆయన మరణవార్త చెవినపడగానే రెండుతరాల ప్రేక్షకులు అయ్యో అంటూ బాధపడ్డారు. 82ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు అలనాటి హీరోచంద్రమోహన్. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు చంద్రమోహన్.
932 సిన్మాలు. హీరోగా, హాస్యనటుడిగా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ పదహారేళ్ల వయసు, ఓ సిరిసిరిమువ్వ.. అంతెందుకు ఇంకా మన మనసు పొరల్లోంచి చెరిగిపోని శంకరాభరణం. ఏ సిన్మాలోనైనా తన టాలెంట్ వేరు. ఎవరితో ఆయనకు పోలికే లేదు. తన నటనే ప్రత్యేకం. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్.. 23ఏళ్ల వయసులోనే 1966లో రంగులరాట్నం సిన్మాతో తెరంగేట్రం చేశారు. ఐదుదశాబ్ధాల సుదీర్ఘ నటప్రయాణంలో మరపురాని పాత్రలెన్నో చేశారు.
ఏదో ఒకపాత్రని రాజీ పడి ఉంటే చంద్రమోహన్ ఏనాడో 1000 సిన్మాల మైలురాయిని దాటి ఉండేవాడు. కానీ ఆయనెప్పుడూ ఆ పనిచేయలేదు. చివరిగా 2017లో ఆక్సిజన్ సిన్మాలో చంద్రమోహన్ కనిపించారు. పాత తరం హీరోయిన్లలో చాలామంది తొలిసారి చంద్రమోహన్ సరసన నటించినవారే. ఆయనెంత ప్రాక్టికల్‌గా ఉండేవారో చెప్పేందుకు ఓ సంభాషణని ఇప్పుడంతా గుర్తుచేసుకుంటున్నారు. హీరోయిన్లని కౌగిలించుకున్నప్పుడు, రొమాంటిక్ సీన్ల సమయంలో ఏ ఫీలింగ్ కలగదా అని చంద్రమోహన్‌ని ఓ జర్నలిస్ట్ సరదాగా అడిగాడు. చుట్టూ లైట్లు, కెమెరాలు, బోలెడంత హడావుడిలో ఫుల్ మేకప్పు వేసుకున్నవాళ్లు కావలించుకుంటే ఫీలింగ్ ఏముంటుందన్నది చంద్రమోహన్ సమాధానం. ఆ సమయంలో “వాళ్లను కౌగిలించుకున్నా, పక్కనుండే చెట్టును కావిలించుకున్నా ఒకటే” అది జస్ట్ నటనేనంటూ చంద్రమోహన్ చెప్పిన సమాధానం చాలు ఆయనెంత ప్రొఫెషనలో చెప్పేందుకు!
చంద్రమోహన్ ఎప్పుడూ వివాదాల్లో లేరు. ప్రచారంలో ఉండాలని ఆయనెప్పుడూ తాపత్రయపడింది లేదు. కళాతపస్విని చివరి చూపు చూసేందుకు వచ్చినప్పుడే చాలామందికి తెలిసింది ఆయన విశ్వనాధ్ సమీప బంధువని. అందరినీ తమ గొంతులతో అనుకరించే మిమిక్రీ ఆర్టిస్టులు చంద్రమోహన్ గొంతును పట్టుకోలేరు. ఆయన నటనని ఎవరూ అనుకరించలేరు. పౌర్ణమిలాంటి సిన్మాలో హీరోయిన్ తండ్రిగానైనా, మరో సిన్మాలో కామెడీ అయినా చంద్రమోహన్ చంద్రమోహనే. కామెడీలో ఆయన టైమింగ్ అదిరిపోతుంది. ఆయన ఇంకాస్త హైట్ ఉండుంటే టాలీవుడ్‌ని దున్నేసి ఉండేవాడే. అయితేనేం ఆయనకున్న గుర్తింపు ఎవరికుందని? బోలెడు నందులు వచ్చాయ్. వరే అవార్డులు చాలా ఉన్నాయ్. పద్మమొక్కటి రాలేదంటేనే తెలియడం లేదూ ఆయనెంత స్వచ్ఛమైన, నికార్సయిన నటుడో!?