రేవంత్‌ కంటే కేసీఆర్‌ మంచోడట!

sharmila-counter-to-revanthreddy.jpg

తెలంగాణలో బీజేపీకి సీన్‌ అర్ధమైపోయింది. ఆర్నెల్లక్రితం ఉన్న ఊపులేదు. అధికారంలోకొస్తామని బీరాలు పలికిన పార్టీ రెండంకెల సంఖ్యలోనైనా సీట్లు వస్తాయోలేదోనని డైలమాలో పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్‌ అధికార బీఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మధ్యేనని సగటు ఓటరుకి అర్ధమైపోయింది. ఇప్పుడు బీజేపీ టార్గెట్‌ ఒక్కటే. మనం రాకపోయినా ఫర్లేదు. కాంగ్రెస్‌ మాత్రం అధికారంలోకి రాకూడదు. అందుకే ఆయనకంటే ఈయన మంచోడన్న మాట ఆ పార్టీనేతల నోట వస్తోంది.

తెలంగాణలో తమకు దక్కని అధికారం కాంగ్రెస్‌కు కూడా దక్కొద్దనేది బీజేపీ పట్టుదల. అందుకే రేవంత్‌రెడ్డి కంటే కేసీఆరే మంచోడు అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోతే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కూడా కామెంట్ చేశారు. అంటే కమలం లెక్క ప్రకారం తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌ గెలవకూడదు. తాము గెలవకపోయినా ఫర్లేదు. కానీ కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదు. దాని బదులు మరోసారి బీఆర్‌ఎస్ గెలిచినా ఆనందమే.

ప్రస్తుతం తెలంగాణలో గెలుపోటములను నిర్ణయించేది మైనారిటీ ఓటర్లే. ఆ ఓటర్లు దాదాపుగా బీజేపీ వైపు చూడరనేది ఓపెన్‌ సీక్రెట్‌. మొన్నటిదాకా బీఆర్‌ఎస్‌ వైపున్న మైనారిటీలు ఈసారి భిన్నంగా ఆలోచిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. 2014కు ముందులా ముస్లిం ఓటర్లు మళ్లీ కాంగ్రెస్‌ వైపు మొగ్గుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా ఎంఐఎం ఏం చెబితే తెలంగాణలోని ముస్లింలు అదే పాటిస్తారన్న ట్రెండ్‌ మొదట్నించీ ఉంది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేకపోవచ్చు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయమని ఒవైసీ బ్రదర్స్ నేరుగా చెబుతున్నారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ఎంఐఎం అభ్యర్ధిని గెలిపించి, మిగిలిన చోట్ల బీఆర్‌ఎస్‌కి మద్దతివ్వాలని మజ్లిస్‌ పార్టీ పిలుపిచ్చినా ముస్లిం ఓటర్లు పెద్దగా ప్రభావితం కావడంలేదు.

తెలంగాణలోని దాదాపు 40 స్థానాల్లో మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 15 నియోజకవర్గాల్లో ముస్లింలు బలంగా ఉన్నారు. కర్నాటక ఎన్నికల తరువాత మైనారిటీ ఓటర్ల ఆలోచనలో మార్పు మొదలైందని చెబుతున్నారు. బీజేపీని ఓడించేది కాంగ్రెస్సే అనే బలమైన నిర్ణయానికి రావడమే దీనికి కారణం. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌ అనే ప్రచారం బలంగా ఉండటమే ముస్లింలలో మార్పుకు కారణం అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లను ఎంఐఎం చీల్చుతూ వచ్చింది. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తూ తెలియకుండానే బీజేపీకి మేలు చేస్తూ వచ్చామన్న అభిప్రాయానికి తెలంగాణలో మైనారిటీ ఓటర్లు వచ్చినట్లే కనిపిస్తోంది.

Share this post

submit to reddit
scroll to top