ఆదివారం.. అహ్మదాబాద్‌.. అన్ని కళ్లూ అటే!

ahmedabad-stadium-world-cup-finals.jpg

అవును ఆ రోజుకోసమే అంతా ఎదురుచూస్తున్నారు. క్రీడాభిమానులైతే క్షణాలు యుగాల్లా గడిపేస్తున్నారు. 2023 వరల్డ్‌కప్‌ గ్రాండ్‌ ఫినాలె ఆ రోజే. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటిదాకా ఓటమి అనేదే ఎరుగని టీమిండియా ఫైనల్స్‌లో ఆసీస్‌తో తలపడబోతోంది. అందుకే అందరిలో అంత ఉత్కంఠ. క్రికెట్‌ దునియా అంతా ఇప్పుడు గుజరాత్‌ వైపు చూస్తోంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయబోతోంది. ఫైనల్‌ మొదలవ్వడానికి 10నిమిషాల ముందు ఈ విన్యాసాలు అభిమానులను అలరించబోతున్నాయి.

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆసీస్‌ జట్టు టీమిండియాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. అయిదుసార్లు ప్రపంచకప్‌ని అందుకున్న ఆస్ట్రేలియా ఫైనల్‌కి చేరడం ఇది ఎనిమిదోసారి. వన్డే వరల్డ్‌కప్‌-2023 ట్రోఫీని ముద్దాడేందుకు అడుగుదూరంలోనే ఉంది మన టీమిండియా. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోబోతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు ఒకే ఒకసారి తలపడ్డాయి. 2003లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫైనల్లో టీమిండియా- ఆసీస్‌ జట్లు పోటీ పడ్డాయి. కానీ భారత్‌కి నిరాశే మిగిలింది. 125 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆ ఫైనల్‌ టోర్నీలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(140 నాటౌట్‌) చెలరేగి ఆడాడు. అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ 8 మంది బౌలర్లను దించినా ఆసీస్‌ జోరును ఆపలేకపోయాడు. 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 234 పరుగులకే ఆలౌటైంది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. మన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. కప్పు అందుకోవడమే ఆలస్యం. ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా.

Share this post

submit to reddit
scroll to top