తెలంగాణలో ఎన్నికల సమరం బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోవటంతో బీజేపీ తన అమ్ములపొదిలోంచి బ్రహ్మాస్త్రాన్ని బయటికితీసింది. తాము అధికారంలోకొస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. దళితుడిని సీఎంని చేసే దమ్ము కేసీఆర్‌కి ఉందా అంటూ అధికారపార్టీకి సవాల్ విసిరింది. కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా రంగంలో దిగారు. బీజేపీ బీసీ నినాదం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలి అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పర్యటించిన అమిత్‌షా సూర్యాపేట బహిరంగసభలో సంచలన ప్రకటన చేశారు. తమకు అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
బీఆర్‌ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అన్న అమిత్ షా.. జాతీయస్థాయిలో రాజ్యాంగబద్దంగా బీసీ కమిషన్ వేసిన ఘనత బీజేపీదేనన్నారు. ఏడాదికి 10వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పి వెనకబడిన వర్గాలను కేసీఆర్ మోసం చేశారన్నారు. బీసీ ఓట్లను టార్గెట్ చేస్తూనే అమిత్‌షా దళిత అంశాలను ప్రస్తావించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్ వారికి ఇస్తానన్న మూడెకరాల భూమి విషయంలోనూ మోసం చేశారంటూ అమిత్‌షా టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ విమర్శలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా దళితబంధు సృష్టించింది తమ ప్రభుత్వమేనని అన్నారు.
బీజేపీ బీసీ సీఎం ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మార్చేలా ఉంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లయినా వస్తాయోలేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న టైంలో ఆ పార్టీ బీసీ సీఎం నినాదాన్ని అందుకుంది. బీజేపీలో కీలకంగా ఉన్న బీసీ నేతల్లో ఇద్దరి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చి పార్టీలో కీలకంగా మారిన ఈటల రాజేందర్. పార్టీకి విధేయుడిగా పేరున్న ఓబీసీ జాతీయమోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. మరికొందరు బీసీ నేతలు కూడా యాక్టివ్‌గా ఉన్నా ఈ ముగ్గురిలోనే సీఎం అభ్యర్థి ఉండొచ్చు.
మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచాక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాక్టివ్‌గా పనిచేశారు. ఉప ఎన్నికల్లో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావటంతో ఆయనపై జాతీయ నాయకత్వంలో సానుకూలత ఏర్పడింది. అధ్యక్షబాధ్యతలనుంచి తప్పించినా ఆయనకు పార్టీ జాతీయపదవితో బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. మరోవైపు ఈటల రాజేందర్ కూడా బీజేపీలో కీలకంగా మారారు. బీఆర్‌ఎస్‌తో తలపడి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటలపై పార్టీకి గట్టి గురి ఉంది. సీఎం కేసీఆర్‌ని ఢీకొట్టాలంటే ఈటల వల్లే అవుతుందని ఆయన్ని గజ్వేల్ బరిలో కూడా దించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల ఉద్యమ కాలంనుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌కి కూడా బీజేపీ నాయకత్వం ప్రాధాన్యమిస్తూ వస్తోంది. అందుకే బీజేపీ ఒకవేళ గెలిస్తే ఈ ముగ్గురిలో సీఎం పదవి ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది.