త‌ల‌పులు ఎన్నెన్నో క‌ల‌లుగ కంటావూ..

vv-lakshminarayana.jpg

క‌ల్ల‌ల‌వుతాయ‌ని ఇప్పుడే చెప్పలేంగానీ ఆయ‌న పార్టీ మాత్రం జీవిత‌కాలం లేటు. ఎన్నిక‌ల‌కు మూడునెల‌ల‌ముందు కొత్త పార్టీని ప్ర‌క‌టించారు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌. పార్టీ పేరు జై భారత్‌ నేషనల్‌. ఆయ‌న కొత్త పార్టీ పెడ‌తార‌న్న ప్ర‌చారం కొన్నేళ్లుగా న‌డుస్తోంది. లేదు లేదు టీడీపీలోకి వెళ్తార‌ని, జ‌న‌సేన‌లోకి ఘ‌ర్‌వాప‌సీ ఉండొచ్చ‌ని కూడా చెప్పుకున్నారు. ఆ మ‌ధ్య వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌న‌ను ప్ర‌శంసించటంతో కొంప‌దీసి వైసీపీలోగానీ చేర‌బోతున్నారా అన్న డౌట్ కూడా వ‌చ్చేసింది. కానీ ఆ పార్టీ ఈపార్టీ ఎందుకు మ‌న‌మే ఓ పార్టీ పెట్టేస్తే పోలా అనుకున్న‌ట్టుంది.. కొత్త జెండా చేప‌ట్టారు సీబీఐలో ఒక‌ప్పటి జాయింట్ డైరెక్ట‌ర్.

ఎవ‌రి విజ‌యావ‌కాశాల‌కు గండి కొట్టేందుకు? ఎవ‌రి ఓట్లు చీల్చేందుకు? ఎవ‌రికి మేలు చేసేందుకు? జ‌ఏడీ ల‌క్ష్మినారాయ‌ణ కొత్త పార్టీపై తెర‌పైకి ఇలాంటి ప్ర‌శ్న‌లెన్నో వ‌స్తున్నాయి. ఓ ఛాన‌ల్ డిబేట్‌లో జేడీని అదే ప్ర‌శ్న‌లు అడిగితే తామ‌రాకు మీద నీటిబిందువులా బ్యాలెన్స్ చేశారాయ‌న‌. వైనాట్ 175 అంటూ మ‌రోసారి అధికారంలోకి రావ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకుంది వైసీపీ. వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు తెలుగుదేశం-జ‌న‌సేన ఒక్క‌ట‌య్యాయి. బీజేపీ వాటితో జ‌త క‌లుస్తుందో లేదో ఇంకా ఓ క్లారిటీ లేక‌పోయినా, ఆ రెండుపార్టీల కాంబినేష‌న్‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో జేడీ ల‌క్ష్మినారాయ‌ణ కొత్త పార్టీ ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కు ఉంటుంద‌న్న‌దే ప్ర‌శ్న‌.

పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ లీడర్లంత కాక‌పోయినా సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణకు కూడా చెప్పుకోద‌గ్గ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న్నో సిన్సియ‌ర్ మాజీ అధికారిగానే చూస్తారంతా. అందుకే సీబీఐ అధికారిగా ఉన్నప్పటి నుంచి ప్ర‌స్తుత రాజకీయాల దాకా… ల‌క్ష్మినారాయ‌ణ ఏ నిర్ణ‌యం తీసుకున్నా, ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. ఇప్పుడు జై భారత్ (N) పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడి సృష్టించారు. 1965 ఏప్రిల్ 3న కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించిన వాసగిరి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా ప‌నిచేశారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా సంచలన కేసుల దర్యాప్తుతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు, ఆ తర్వాత ఔట‌ర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ అక్రమాల కేసు, సత్యం కుంభకోణం కేసు దర్యాప్తులు జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌కు మంచిపేరు తెచ్చాయి. ఓఎంసీ కేసు, జగన్‌ ఆస్తుల కేసు దర్యాప్తుతో బాగా పాపుల‌ర్ అయ్యారాయ‌న‌. విశిష్ట సేవలకు గాను 2017లో లక్ష్మినారాయణకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ కూడా దక్కింది. 2018 మార్చిలో వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మీనారాయణ త‌ర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. రాయలసీమలో ప్రజలపక్షాన పాదయాత్ర కూడా చేశారు. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతిచ్చారు.

ఓడినా, గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉంటానంటూ గతంలోనే ప్రకటించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త పార్టీని ఏర్పాటు చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరి, ఆయన ఎంట్రీ అధికార పక్షానికి మేలు చేస్తుందా? విపక్షం ఆశలపై నీళ్లు చల్లుతుందా? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణ‌యం నాలుగేళ్ల క్రిత‌మే తీసుకునుంటే ఈపాటికి ఆయ‌న కొత్త పార్టీ ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లి ఉండేది. రాజ‌కీయంగా స‌రైన దారి ఎంచుకోలేక‌, రాజీప‌డి ఏదో ఒక పార్టీలో చేర‌లేక చివ‌రికి సొంత జెండా ఎత్తారు జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌. ఎవ‌రికీ ఓటేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌నివారికి ‘నోటా’ ఉన్నట్లు.. అన్ని పార్టీల మీద వైరాగ్యం చెందిన‌వారికి ఈ కొత్త పార్టీ ఏమ‌న్నా ద‌గ్గ‌ర‌వుతుందేమో!

 

Share this post

submit to reddit
scroll to top