మాస్టర్‌ మైండ్‌ మహ్మద్‌ డెయిఫ్‌!

Hamas-Terrorist.jpg

ఇజ్రాయిల్‌ని వణికించిన ‘ఆపరేషన్‌ అల్‌ అక్సా స్ట్రామ్‌’ వెనుక ఉన్నదెవరో తెలుసా. మహ్మద్‌ డెయిఫ్‌. హమాస్‌ టెర్రర్‌ గూప్‌ లీడర్‌. ఆపరేషన్‌ స్టార్ట్‌ అంటూ అతని గొంతు వినగానే ఇజ్రాయిల్‌ భద్రతాదళాలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ఆ గొంతు వారికి చిరపరిచితం. అతనికోసం ఏళ్లుగా ఇజ్రాయిల్‌ భద్రతాదళాలు, ఆ దేశ ఇంటలిజెన్స్‌ మొస్సాద్‌ గాలిస్తున్నాయి. దొరికినట్లే దొరికి పాదరసంలా జారిపోతున్నాడు. 1965లో గాజాలోని ఓ శరణార్థి శిబిరంలో పుట్టిన డెయిఫ్‌ ఇప్పుడు హమాస్‌ గ్రూప్‌కి మాస్టర్‌మైండ్‌గా మారిపోయాడు.

1965లో పుట్టిన మహ్మద్‌ డెయిఫ్‌ పద్నాలుగు పదిహేనేళ్ల వయసుకే హమాస్‌లో చేరాడు. తమకు యుద్ధ వ్యూహాలు నేర్పించే డెయిఫ్‌ని హమాస్‌ ఉగ్రవాదులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇజ్రాయిల్‌ దళాలు అతని ఆచూకీ పసిగట్టే అవకాశం ఇవ్వకుండా రోజుకో షెల్టర్‌ మారుస్తుంటారు. వాస్తవానికి అతని పేరు మస్రీ. హమాస్‌లో చేరాకే డెయిఫ్‌గా మారింది. డెయిఫ్‌ అంటే అరబిక్‌లో అతిథి అని అర్థం. అంటే అతను పాలస్తీనాలో ఎప్పుడు ఏ ఇంట్లోనైనా అతిధిగా ప్రత్యక్షం అవుతుంటాడన్నమాట!

మహ్మద్‌ డెయిఫ్‌ ఎక్కడ పెరిగాడో ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలీదు. అతనికి సన్నిహితుడైన అయ్యాష్‌కు ఇజ్రాయిల్‌ దళాల చేతిలో హతమయ్యాక.. 2002లో డెయిఫ్‌ హమాస్‌ మిలటరీ వింగ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. హమాస్‌ వాడే కస్సాం రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర డెయిఫ్‌దే. అంతేకాదు. ఇజ్రాయిల్‌ దళాలకు అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయిన గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం వెనుక మహ్మద్‌ డెయిఫ్‌నే మాస్టర్‌ మైండ్‌గా చెబుతారు. అతను ఎక్కువగా ఉండేది మూడోకంటికి తెలీని అలాంటి టన్నెల్స్‌లోనే.

డెయిఫ్‌ని కడతేరిస్తే హమాస్‌ వెన్ను విరిచినట్లే. అందుకే ఇజ్రాయిల్‌ దళాలు అతని కోసం ఎప్పట్నించో వేటాడుతున్నాయి. కానీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, కంప్యూటర్లు వాడకపోవటంతో డెయిఫ్‌ ఆచూకీ తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. ఇప్పటిదాకా డెయిఫ్‌పై ఇజ్రాయిల్‌ దళాలు ఏడు సార్లు దాడులు చేశాయి. అయితే ప్రతిసారీ అదృష్టం అతని వైపే ఉంటోంది. 2000లో జరిగిన ఓ దాడిలో మాత్రం డెయిఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ కన్ను కోల్పోయాడు. ఆ దాడిలో అతని అవయవాలు కొన్ని దెబ్బతిన్నాయి. 2006లో హమాస్‌ సభ్యుడి ఇంట్లో జరిగిన దాడిలో మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు.

2014లో ఐదో సారి జరిగిన దాడి నుంచి కూడా డెయిఫ్‌ బయటపడ్డా భార్యాపిల్లలు మరణించారు. 2021 గాజాపై జరిపిన ఆపరేషన్‌లో కూడా రెండుసార్లు తప్పించుకున్న డెయిఫ్‌ తాజా దాడితో ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇజ్రాయిల్‌పై వేలసంఖ్యలో విరుచుకుపడ్డ రాకెట్ల తయారీ రూపకర్త కూడా మహ్మద్‌ డెయిఫేనని భావిస్తున్నారు. అందుకే ఇజ్రాయిల్‌పై దాడి తర్వాత మహ్మద్‌ డెయిఫ్‌ కోసం మరోసారి తీవ్ర వేట మొదలైంది. ఈసారి కూడా బయటపడతాడా? ఈ భూమ్మీద అతనికి నూకలు చెల్లిపోయే సమయం దగ్గరపడిందా?

Share this post

submit to reddit
scroll to top