ఫ్రెండ్స్ అనేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కొందరు కలిసినప్పుడు పలకరించునేవాళ్లయితే, మరికొందరు చేతుల్లో చేతులేసుకుని చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అంటే బాగా క్లోజ్‌ఫ్రెండ్స్ అన్నమాట. మనుషుల మధ్యే కాదు.. పార్టీల మధ్య కూడా ఉంటుందీ ఫ్రెండ్‌షిప్. అక్కడ కూడా అంతే. కొన్ని ఫ్రెండ్‌షిప్‌లు ఒకళ్ల ఒళ్లో ఒకళ్లు కూర్చునేంత బలంగా ఉంటాయి. మరికొన్ని అవసరార్ధ స్నేహాలు. కష్టమొచ్చినప్పుడు నేనున్నాను దోస్త్ అంటూ ఆదుకుంటాయన్నమాట. ఫలానా పార్టీ ఫలానా పార్టీకి బీ టీమ్, సీ టీమ్ అన్న మాటలు వర్తమాన రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టాప్ టూ బాటమ్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువయ్యాయి. దీంతో ఎవరు ఎవరి దోస్త్ అన్నది జనానికి కూడా ఓ పట్టాన అర్ధమై చావడం లేదు.
మోడీ, అమిత్‌షా సహా అగ్రనేతలు ఎవరొచ్చినా కేసీఆర్ కుటుంబపాలనని ప్రస్తావించకుండా ఉండరు. కల్వకుంట్ల కుటుంబం తప్ప తెలంగాణలో మరెవరన్నా బాగుపడ్డారా అని కమలంపార్టీ నేతలు ఎంత గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నా ఆ మాటలు గుండెలోతుల్లోంచే వస్తున్నాయా అన్న డౌటు. కేంద్రంలో బీజేపీ వచ్చాక దేశం సర్వనాశనమైందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించినా, మోడీని నాలుగుతిట్లు తిట్టినా కేసీఆర్ పార్టీ మనస్ఫూర్తిగానే ఆ విమర్శలు చేస్తోందా అన్న అనుమానం. ఎందుకంటే బీజేపీ-బీఆర్‌ఎస్ రహస్య స్నేహితులన్న ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ దొందుదొందేనని బీజేపీ నేతలు చెప్పినా దాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు.
బీజేపీ-బీఆర్‌ఎస్ సేమ్‌టూసేమ్ అన్న కాంగ్రెస్ ఆరోపణలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. బీఆర్‌ఎస్ నేతలమీద ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగవు అన్న కాంగ్రెస్ ప్రశ్నలో సమాధానం వెతుక్కోవచ్చు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఏపీలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే ఉపేక్షించని బీజేపీ… లిక్కర్‌స్కామ్‌లో కవితను ఎందుకు టచ్ చేయడంలేదన్నది మరో పాయింట్. జాతీయపార్టీ పెట్టిన కేసీఆర్ బీజేపీకి వ్యతిరేక కూటమితో చేతులు కలపకుండా, బీజేపీ-కాంగ్రెస్సేతర కూటమి అనే దేవతావస్త్రాన్ని ఎందుకు చుట్టుకోవాలని అనుకుంటున్నారన్నది మరో కీలకచర్చనీయాంశం. ఇలా చాలా అంశాలు అనుమానాస్పదంగా ఉండబట్టే బీజేపీకి బీఆర్‌ఎస్ ఫ్రెండేనన్న చర్చకు బలం చేకూరుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్-ఎంఐఎం తాము వేర్వేరని చెప్పుకునే ప్రయత్నంచేశాయి. కానీ ఎన్నికలు కాగానే మళ్లీ మధ్యలో గాలి దూరనంత బలంగా హత్తుకున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీకి దిగే మజ్లిస్‌పార్టీపై చాలా అనుమానాలున్నాయి. బీజేపీకి పరోక్ష స్నేహితుడన్న ముద్ర ఎప్పట్నించో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో బలమైన స్నేహం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ని గెలిపించాలని (తాము పోటచేసే సీట్లలో తప్ప) ఎంఐఎం పిలుపునిచ్చింది. ఆ రెండుపార్టీల మధ్య ఒకే కంచంలో తినేంత స్నేహం ఉంది మరి. ఈసారి తమ సత్తా చూపిస్తామని, బలం ఉన్న అన్ని సీట్లలో పోటీచేస్తామని ఆ మధ్య అసద్ తమ్ములుంగారు అసెంబ్లీలో ఆవేశంగా చేసిన ప్రసంగం టైంపాస్‌కేనని తేలిపోయింది.
ఏపీలో ఒకప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన కామన్ ఫ్రెండ్స్. మధ్యలో బీజేపీతో టీడీపీ కటీఫ్ చెప్పినా ఈమధ్య ఆ పార్టీతో జనసేన ఫ్రెండ్‌షిప్ ఇంకాస్త బలపడింది. మళ్లీ మూడో ఫ్రెండ్ వాళ్లతో కలుస్తాడో లేదోగానీ తెలంగాణలో ఆ ఫ్రెండ్ భుజాలపై జనసేన చేతులేసి తిరుగుతోంది. బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తుంటే.. మీ సుఖమే నే కోరుకున్నా అన్నట్లు టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలనాటికి మళ్లీ ముగ్గురూ ఒక్కటవుతారో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే.