గాలి పోగు చేయ‌డం అంటే ఇదే!

channels.jpg

ఒక‌ప్పుడు ప‌త్రిక‌ల్లో వార్త వ‌స్తే విశ్వ‌సించేవారు. ఛానెళ్ల బ్రేకింగ్‌ల‌కు కూడా కొన్నాళ్ల‌క్రితం దాకా ఎంతో కొంత న‌మ్మ‌కం ఉండేది. కానీ ఇప్పుడు మీడియాకి ఏదో ఒక పార్టీ జెండానే ఎజెండా. ఒకే సంఘ‌ట‌న‌కి పూర్తి రివ‌ర్స్ రిపోర్టింగ్‌చేస్తూ ప్రేక్ష‌కుల‌ను వెర్రిబాగులోళ్ల‌ను చేయాల‌నుకుంటోంది తెలుగు మీడియా. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌మీద పోలీసులు లాఠీలు ఝుళిపించార‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు తెగ‌బ‌డ్డార‌ని ఓ ఛాన‌ల్ క‌వ‌రేజ్ ఇస్తుంటుంది. అదే సంఘ‌ట‌న‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లే పోలీసుల‌పై దౌర్జ‌న్యానికి దిగిన‌ట్లు అధికారిక మీడియా ఊద‌ర‌గొట్టేస్తుంటుంది. ముఖ్య‌మంత్రి స‌హా ముఖ్య‌నేత‌లు ఎల్లో మీడియా అంటూ ప‌దేప‌దే కొన్ని ఛానళ్లు, న్యూస్ పేప‌ర్ల‌మీద దుమ్మెత్తిపోస్తుంటారు. విప‌క్ష‌పార్టీల‌కు వ‌త్తాసు ప‌లికే మాధ్య‌మాల‌కు అధికారిక వెర్ష‌న్ ఇచ్చే ఛాన‌ల్స్ నీలి మీడియాలా క‌నిపిస్తుంటాయి. అందుకే జ‌నంలో మీడియాపై విశ్వాసం అంత‌కంత‌కీ స‌న్న‌గిల్లుతోంది.

బ‌ట్ట‌లు చించుకుని బ‌జార్న ప‌డ్డ‌ట్లే ఉంది కొన్ని మీడియాల ధోర‌ణి. జ‌రిగిన సంఘ‌ట‌ల‌ను వక్రీక‌రించ‌డం ఓ ఎత్త‌యితే నాలుగ్గోడ‌ల మ‌ధ్య ఏదో జ‌రిగింద‌న్న ఊహాజ‌నిత క‌థ‌నాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. టీడీపీ వాయిస్‌గా పేరున్న ఓ తెలుగు ఛాన‌ల్ బ్రేకింగ్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వైఎస్సార్టీపీ పార్టీతో తెలంగాణ‌లో రాజ‌కీయం చేస్తున్న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ కూతురు వైఎస్ ష‌ర్మిల‌కి సంబంధించిన బ్రేకింగ్ అది. టార్గెట్టే వైఎస్ కుటుంబం అయిన‌ప్పుడు ష‌ర్మిల‌తోనే ఎందుకాగుతారు. బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టేశారు. ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న‌ట్లు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ర్నాట‌క నేత డీకే శివ‌కుమార్ స‌హా ఢిల్లీ పెద్ద‌లను కూడా ష‌ర్మిల క‌లుసుకున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి ఇది ఇష్టంలేదు. అందుకే ఆమెను ఆంధ్రాలో రాజ‌కీయం చేసుకోమ‌ని మొహ‌మాటం లేకుండా చెప్పేశారు. కాంగ్రెస్ పెద్ద‌లు కూడా ఆమెను ఏపీపై దృష్టిపెట్టాల‌ని కోరిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇంత‌వ‌ర‌కు వాస్త‌వానికి కాస్త ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లే!

వైసీపీ ఎల్లోమీడియాగా చెప్పే ఓ ఛాన‌ల్ దీన్ని బేస్ చేసుకుని బ్రేకింగ్‌లు వండివార్చేసింది. చెల్లి మీదికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని త‌ల్లిని బ్ర‌హ్మాస్త్రంలా ప్ర‌యోగించార‌ట‌. ఆయ‌న చెప్ప‌డ‌మే త‌రువాయి విజ‌య‌మ్మ అర్జంట్‌గా మాట్లాడే ప‌నుందంటూ కూతురికి క‌బురంపార‌ట‌. త‌ల్లి పిలవ‌గానే వేరే ప‌నుల‌న్నీ మానేసి ష‌ర్మిల ఆగ‌మేఘాల‌మీద వ‌చ్చి క‌లిశాకే అన్న రాయ‌బారం గురించి తెలిసింద‌ట‌! వైఎష్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అడుగుపెడితే త‌న‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న భ‌యంతో జ‌గ‌న్ త‌ల్లి సాయంతో చెల్లితో దౌత్యం నెరిపార‌న్న‌ది ఆ బ్రేకింగ్ సారాంశం. కాంగ్రెస్‌లో చేరొద్ద‌ని చెప్పార‌ని, చేరినా తెలంగాణ‌కే ప‌రిమితం కావాల‌న్న‌ది చెల్లికి త‌ల్లిద్వారా సందేశం పంపార‌ట‌. చెల్లికి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా సెట్ చేస్తాన‌ని జ‌గ‌న్ ప్రామిస్ చేశార‌ట‌. ఈ ఎపిసోడ్‌లో ట ట లు త‌ప్పితే ఎవ‌రూ క‌ళ్ల‌తో చూసింది లేదు. చెవుల‌తో వినింది లేదు.

గుడ్డ‌కాల్చి మొహానేస్తే వాళ్లే తుడుచుకుంటార‌న్న‌ట్లుంది బ‌ట్ట‌లిప్పేసిన మీడియా తీరు. ఏ స‌జ్జ‌లో మీడియా ముందుకొచ్చి చెల్లితో అన్న‌కు రాయ‌బారం లేద‌ని ఖండిస్తే ఊహాజ‌నిత బ్రేకింగ్‌కి సార్థ‌క‌త చేకూరుతుంద‌న్న ఆశ‌కాబోలు! వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరి ఏపీ మీద దృష్టి పెట్టాల‌ని ఆ పార్టీ నాయ‌క‌త్వం కోరుకుంటుందో లేదోగానీ.. అలా జ‌ర‌గాల‌ని ఇలాంటి మీడియా మాత్రం ప‌ల‌వ‌రిస్తోంది. వైఎస్ వివేకా హ‌త్య‌కేసుతో ఆ కుటుంబంలో చిచ్చు రేగింద‌ని సంబ‌ర‌ప‌డుతున్న‌వారు.. చెల్లి ఏపీలో అడుగుపెట్టి అన్న‌మీద గొంతెత్తాల‌ని కోరుకుంటున్నారు. పాపం వారి ఆశ‌లు ఫ‌లిస్తాయో లేదోగానీ ఇలాంటి గాలి బ్రేకింగ్‌లైతే పుట్టుకొస్తూనే ఉంటాయేమో!

 

 

Share this post

submit to reddit
scroll to top