తెలంగాణ ఎన్నికలతో ఏపీలో వేడి!

Telangana-Elections.jpg

ఇప్పుడంటే వేర్వేరు రాష్ట్రాలు. పదేళ్లక్రితం ఉమ్మడి రాష్ట్రమే కదా. అందుకే ఎంత కాదనుకున్నా లేదనుకున్నా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై పడుతోంది. తెలంగాణలో బీసీ సీఎం హామీ, జనసేన-బీజేపీ దోస్తీ ఇలా ప్రతీ అంశాన్ని ఏపీతో పోలుస్తుండటంతో రాజకీయ వేడి పెరుగుతోంది. రెండూ తెలుగు రాష్ట్రాలే. అక్కడా ఇక్కడా పోటీ చేసే పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నాయి. పైగా ఏపీకి చెందిన సెటిలర్లు కూడా తెలంగాణలో ఎక్కువే. అందుకే తెలంగాణ ఎన్నికలపై ఏపీలో ఎక్కువ చర్చే జరుగుతోంది.

ఏపీలో టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లడం సైకిల్‌పార్టీ కేడర్‌ని గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దింపిన పవన్ కళ్యాణ్ వారి ప్రచారం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ మాత్రం బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పాటు ఏపీలో బీజేపీ బీసీ నాయకులను, బీసీ సంఘాల నేతలను ప్రచారంలోకి దించుతోంది. అయితే జనసేన తెలంగాణ ఎన్నికల్లో బోణీ కొడితే దాని ప్రభావం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుంది. అలాకాకుండా ఒక్క సీటూ గెలవకపోతే ఏపీలో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం కూడా తప్పుడు సంకేతాలిస్తోంది. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ పార్టీకి రాజీనామా చేసేదాకా వెళ్లింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓడిపోవాలని కోరుకుంటున్న టీడీపీ కాంగ్రెస్‌కి పరోక్షంగ మద్దతు ఇచ్చేందుకు పోటీకి దూరమైందన్న వాదన బలంగా ఉంది. టీడీపీ ఓటు బ్యాంక్‌తో పాటు సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లాలన్నదే చంద్రబాబు ఆలోచనంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఏపీలో తమకు పరిస్థితులు అనుకూలిస్తాయనే అంచనాతో టీడీపీ ఉంది. ఒకవేళ తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share this post

submit to reddit
scroll to top