ఎవరా నలుగురు.. ఏరా నలుగురు?

File-Photo-poor-man-carrying-wifes-dead-body.jpg

ఎలా బతికినా ఎంతకాలం బతికినా చివరికి చేరాల్సింది కాటికే. కానీ ఊపిరి లేని ఆ దేహాన్ని మోయడానికి నలుగురైనా లేకపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. స్వతంత్ర భారతంలో మనిషిమనిషికో లెక్క. సామాజికవైరుధ్యాలు. ఆర్థిక అంతరాలు. ఒకరికి తిన్నది అరగదు. మరొకరికి అన్నంమెతుకు దొరకదు. ఉన్నోడు పోతే చావుకూడా పెళ్లిలాగే ఉంటుంది. పేదోడు పోతే కాల్చేందుకు కట్టె కూడా కరువవుతుంది.

పేదోడికి బతుకే కాదు చావుకూడా శాపమే. ఎందుకంటే నా అనేవాళ్లు నలుగురు ఉండరు. శ్మశానందాకా ఎవరూ తోడురారు. అయినవాళ్ల చావు గుండెల్ని మెలేస్తుంటే కన్నీళ్లు దిగమింగుకుంటూ ఎలాగోలా అంతిమసంస్కారాలు పూర్తిచేస్తారు. పక్కవాడు బతికాడో చచ్చాడో చూసేంత తీరికలేని, గుప్పెడంత మనసైనా లేని సమాజానికి ఇలాంటివారి బాధ అర్ధంకాదు. అయ్యో అనేంత సమయం కూడా దొరకదు. ఈ జనారణ్యంలో అంతా ప్రాణమున్న యంత్రాలే కదా!కూతురి శవాన్నో, కట్టుకున్నదాని విగతదేహాన్నో తీసుకెళ్లేందుకూ డబ్బుల్లేక కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లిన దృశ్యాలు చూసి సానుభూతి చూపడం తప్ప మరేమీ చేయలేని సమాజంలో బతుకుతున్నాం మనం.

ఉత్తరప్రదేశ్‌లో జబ్బుచేసి వైద్యానికి డబ్బుల్లేక 26ఏళ్ల మహిళ నిస్సహాయంగా కన్నుమూసింది. గుండెలనిండా బాధ తప్ప జేబులో చిల్లిగవ్వలేదు. దీంతో శ్మశానవాటికకు తీసుకెళ్లే స్థోమత కూడా లేక ముందు భర్త, వెనుక తండ్రి ఓ బట్టలో చుట్టి శవాన్ని డోలీలా మోశారు. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోని సంగమనగరిలో ఐదు కిలోమీటర్లు ఇలాగే సాగింది ఆ నిరుపేద అంతిమయాత్ర. ఇద్దరు శవాన్ని మోస్తుంటే.. మృతురాలి తల్లి రోదిస్తూ వెంట నడుస్తుంటే ఐదు కిలోమీటర్ల పొడవునా ఏమైందని ఎవరూ అడగలేదు. ఒక్కరంటే ఒక్కరూ అయ్యోపాపం అన్లేదు. చివరికి పోలీసుల దృష్టికి వెళ్లి వారే అక్కడికక్కడ విరాళాలు పోగు చేసి మృతదేహం తరలించేందుకు ఏర్పాటు చేశారు. మన తల్లి అన్నపూర్ణ, మన అన్న దానకర్ణ, మన కీర్తి మంచుకొండరా తమ్ముడూ.. గుండెదిటవు చేసుకో!

Share this post

submit to reddit
scroll to top