రాత్రింబవళ్లు కష్టపడే పిల్లల ఆశలు ఆకాంక్షలతో పన్లేదు. రేపటి భవిష్యత్తు కోసం యజ్ఞంలా పరిశ్రమించే యువతరం కలలు కల్లలైపోయినా ఫర్లేదు. సొమ్మున్న బడాబాబులకు పేపర్లు అమ్ముకుంటే మన జేబులు నిండుతాయి అది చాలు. కశ్మీర్‌నుంచి కన్యాకుమారి దాకా యువతరం జీవితాలతో ఆడుకుంటున్నారు లీకు వీరులు. క్లాస్ ఫోర్ జాబునుంచి ఆఫీసర్ కొలువుదాకా ఏదయినా పల్లీబఠానీల్లా పేపర్లు అమ్మేసుకోవడమే. దొరికేవాళ్లే దొంగలు. చేసేవి దొంగ పనయినా దొరక్కుండా తిరిగే దొరలెందరో! అందుకే కాస్త ఆలస్యమైనా కఠినచట్టాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై ఇక ఉక్కుపాదం మోపనుంది. లీకుల ముఠాలు, మాఫియాపై కొరడా ఝుళిపించబోతోంది.
అక్రమార్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. నేరం నిరూపణ అయితే.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల దాకా జరిమానా విధించనుంది. పోటీ పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్షలు రాయించడమో, ముందుగానే పేపర్లు లీక్ చేయడమో లాంటివి లెక్కలేనన్ని జరిగాయి. ఇలాంటి వ్యవహారాల వెనుక కేవలం ఒకరిద్దరి హస్తమే కాదు.. పెద్ద మాఫియా గ్యాంగే ఉంటుంది. ఇలాంటి వారి వల్ల విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. నేరం నిరూపణకాదు. శిక్షపడుతుందన్న భయమూ లేదు. అందుకే ఇన్నాళ్లూ మూడు పేపర్లు ఆరు లీకులుగా సాగింది కొందరి దందా.
పోటీ పరీక్షల్లో డూప్లికేట్ అభ్యర్థులు, పేపర్ లీకేజ్ స్కామ్‌లకు అడ్డుకట్ట వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. దాని కోసం ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది. మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడే అక్రమార్కులను అడ్డుకునేందుకు.. ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిన్ మీన్స్ పేరుతో లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి, జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా విధిస్తారు. చిత్తశుద్ధితో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అండగా నిలవడంతోపాటు.. అక్రమార్కుల ఆట కట్టించడమే ఈ బిల్లు ప్రధానం ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు కింద నేరాలన్నీ నాన్-బెయిలబుల్‌తోపాటు.. పోలీసులకు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వారెంట్ లేకుండానే అనుమానితుల్ని అరెస్ట్ చేయొచ్చు. బెయిల్‌కు కూడా నిందితులకు అర్హత ఉండదు. అభియోగాలు రాజీ ద్వారా పరిష్కరించే అవకాశం కూడా ఉండదు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలతో పోటీ పరీక్షలు వాయిదా పడటంతో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కంప్యూటరైజ్డ్ పరీక్షా ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చే దిశగా సిఫార్సుల నిమిత్తం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీ ఏర్పాటును బిల్లులో ప్రతిపాదించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. లాంటి బోర్డులు ఈ కొత్త బిల్లు పరిధిలోకి వస్తాయి. పోటీ పరీక్షల్లో అవకతవకలు.. పేపర్ లీకేజీలు దేశంలో పెద్ద సమస్యగా మారాయి. ఇలాంటి ఘటనలు ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. గవర్నర్, ముఖ్యమంత్రి నుంచి క్లర్క్ స్థాయి వరకు వ్యాపమ్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. వ్యాపమ్ స్కామ్‌లో దాదాపు 2,500 మంది ఆరోపణలు ఎదుర్కోగా.. 2వేల మందిదాకా అరెస్టయ్యారు. 1,900 మంది జైలుపాలు అయ్యారు. పదులసంఖ్యలో ప్రాణాలను కూడా వ్యాపమ్ స్కామ్ బలి తీసుకుంది.
అంతెందుకు.. ఈ మధ్య కాలంలో తెలంగాణలోనూ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేపర్ లీకేజీతో యువతలో వచ్చిన వ్యతిరేకత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించిందన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే.. పోటీ పరీక్షల అవకతవకలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కేంద్రం లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టి యువతకు భరోసా ఇస్తోంది. చట్టం కాగితపు పులిలా మిగలకుండా నిందితుల్లో భయం కలిగించాలి. తప్పు చేస్తే తప్పించుకోలేనంత పకడ్బందీగా అమలైతేనే ఏ చట్టానికైనా సార్ధకత!