మోడీ కళ్లకు రాహుల్‌గాంధీ ఇంకా పరిపక్వతలేని పిల్లోడిలాగే కనిపిస్తున్నాడు. 99మార్కులు వచ్చాయని చంకలుగుద్దుకోకు.. వందకు కాదు 543కి అని పార్లమెంట్ సాక్షిగా యువరాజుని ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్నాడు. నేనుగానీ బ్యాటింగ్‌కి దిగితే బాల్ బద్దలవ్వాల్సిందేనని రాహుల్ అనుకుంటారేమోగానీ.. తరచూ తన వికెట్లు తానే పడేసుకుంటుంటారు. అసలే మోడీ మాటల మరాఠీ. ఆయన్ని టార్గెట్ చేసినప్పుడు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ పదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ రాహుల్‌గాంధీకేమో అన్ని తెలివితేటలు లేకపాయ. అందుకే మరోసారి హిందూ వ్యతిరేకిగా అధికారపార్టీ బోనులో నిలబెట్టే అవకాశమిచ్చారు.
పాదయాత్రకు ముందు రాహుల్‌గాంధీ నాయకత్వంపై సొంతపార్టీ నేతలకే నమ్మకం లేదు. భారత్ జోడో యాత్రతో ఆయనకు కాస్త ప్రాపంచిక జ్ఞానం అబ్బింది. రాజకీయంగా ఎంతోకొంత పరిపక్వత కనిపిస్తోంది. ఎన్నికల్లో సొంతంగా సెంచరీకి ఓ సీటు దూరంలో ఆగిపోయినా..కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు మిస్టర్ పర్‌ఫెక్ట్. కానీ తన భాష ఎలాగున్నా భావం అందరికీ అర్ధమవ్వాలి. ఆ విషయంలోనే మరోసారి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు కాంగ్రెస్ యువనేత. శివుడి బొమ్మ చూపించి త్రిశూలం గురించి తనకు తోచిందేదో చెప్పేశారు. ఆయనకెవరు చెప్పారోగానీ తప్పులో కాలేశారు.
అసలే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అనే ముద్ర తరచూ పడుతోంది. బీజేపీ అస్త్రాల్లో ఇదే కీలకం. దాన్ని చెరిపేసుకునేందుకు అప్పుడప్పుడూ ఆలయాల్లో ప్రత్యక్షమైనా, గుళ్లూ గోపురాల చుట్టూ తిరిగినా బీజేపీ నుంచి ఆ పేటెంట్ లాక్కోవడం అంత సులువేం కాదు. పార్లమెంటులో శివుడి బొమ్మ చూపించి త్రిశూలం అహింసకు చిహ్నమని రాహుల్ అంటుంటే అవునా అన్నట్లు అంతా మొహాలు చూసుకున్నారు. బీజేపీమీద బలంగా దాడిచేసే క్రమంలో ఇది డైవర్షన్ సబ్జెక్ట్. తాను శివభక్తుడిననో, ఫక్తు హిందువుననో పార్లమెంట్‌లో రాహుల్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పదేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, వివక్షని ప్రశ్నించొచ్చు. ఎన్డీయే పక్షాలను ఇరుకునపెట్టేలా కీలక అంశాలు ప్రస్తావించొచ్చు. పార్లమెంట్‌కొస్తూ శివుడి బొమ్మెందుకు తెచ్చుకున్నారో ఏంటో!
మోడీకి షేక్‌హ్యాండ్ ఇచ్చేటప్పుడు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా వినమ్రపూర్వకంగా కాస్త ఒంగారట. కానీ తనతో చేయి కలిపినప్పుడు మాత్రం ఛాతీ విరుచుకుని అలాగే నిటారుగా నిలుచున్నారట. ప్రధాని ముందు వంగడం తప్పా.. తన దగ్గర అదే భంగిమ ప్రదర్శించకపోవడం తప్పా? స్పీకర్ అత్యున్నతస్థానంలో ఉన్నా ఆయన కూడా బీజేపీ నాయకుడే. రెండోసారి కూడా అవకాశం ఇచ్చినందుకు ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా ఎలా ఉంటుంది? అదసు ప్రస్తావించాల్సిన అంశమే కాదు. స్పీకర్‌ని లక్ష్యంగా చేసుకుంటే ప్రయోజనం ఉండదన్న పరిపక్వత ఇన్ని ఎదురుదెబ్బల తర్వాత కూడా రాకపోతే ఎలా? ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత వ్యాఖ్యలపై నిలదీసి ఉండొచ్చు. ఆయన నాలుక మడతేస్తున్న విషయాల్ని ఎత్తిచూపొచ్చు. అది వదిలేసి శివుడి చేతిలో త్రిశూలం గురించీ, మతపరమైన హింసగురించీ మాట్లాడి పార్టీని మరోసారి ఆత్మరక్షణలో పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. అపరిపక్వత కాకపోతే!