నుపుర్‌శర్మ వ్యాఖ్యలు వ్యక్తిగతమని తేలిగ్గా తీసుకోవచ్చు. అక్కడక్కడా కాషాయనేతలు అనుచిత వ్యాఖ్యలుచేసినా దాంతో తమకు సంబంధంలేదని దులిపేసుకోవచ్చు. కానీ లోక్‌సభ సాక్షిగా పార్టీ ఎంపీ విపక్షపార్టీ ఎంపీని మతం పేరుతో దూషిస్తే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా? లేదా? సభలో ప్రసంగానికి అడ్డుతగిలితే అసహనంతో ఓ మాట జారితే అర్ధంచేసుకోవచ్చు. అన్న వ్యక్తికూడా తన తొందరపాటుకు పశ్చాత్తాపపడొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఓ మతాన్నే కించపరిచేలా ఎంపీ వీరంగం వేసినా బీజేపీ నాయకత్వం ఖండించలేదంటే ఆ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా? అదే తమ అభిప్రాయమని చెప్పదల్చుకున్నారా? లేకపోతే తమ నీడలో ఉన్నవారు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారా?
ఏయ్ ముల్లా.. ఏయ్ ఉగ్రవాదీ అంటూ లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి. బీఎస్పీ ఎంపీని సభనుంచి ఎత్తి బయటపడేయాలని సలహాఇచ్చారు. బిధూరి వ్యాఖ్యలను స్పీకర్ రికార్డులనుంచి తొలగించారు. పార్టీ ఎంపీ దారుణాతిదారుణంగా మాట్లాడటంతో షాక్‌తిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విచారం వ్యక్తంచేశారు. విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించటంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం ఎంపీ బిధూరికి షోకాజ్ నోటీసు జారీచేసింది. సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతిఇరానీ నిరాధార ఆరోపణలు చేయగానే చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌దగ్గరికి క్యూ కట్టిన బీజేపీ సభ్యులకు రమేష్ బిధూరి వ్యాఖ్యల్లో తప్పు కనిపించలేదు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సచిన్ పైలెట్ పోటీచేస్తను్న టోంక్ నియోజకవర్గానికి బిధూరిని ఇంచార్జిగా నియమించింది. నోరుపారేసుకున్నందుకు ఆయనకు ఇది పార్టీ ఇచ్చిన ప్రత్యేక బహుమతేమో. దానికీ దీనికీ లంకె పెట్టొద్దని బీజేపీ పెద్దలు బుకాయించవచ్చుగాక. ఏరికోరి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం మాత్రం ‘పుండు’మీద కారం చల్లడమే. అతని నోటిదురుసు ఎన్నికల్లో భావోద్వేగాలు రగిలించేందుకు, విద్వేషపు ఓట్లు కొల్లగొట్టేందుకు పనికొస్తుందని బీజేపీ అనుకుంటున్నట్లుంది. బధూరి వ్యాఖ్యల తీవ్రతని తగ్గించేందుకు డానిష్‌అలీ ఎప్పుడో ఏడాదిక్రితం తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎంపీ రవిశంకర్ ఇప్పుడు స్పీకర్‌కి ఫిర్యాదుచేయడం విడ్డూరంగా ఉంది.

ప్రధానికి బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ లేఖ
కొత్త పార్లమెంట్ సాక్షిగా తనను అవమానించారని డానిష్ అలీ అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి బీఎస్పీ ఎంపీ లేఖ రాశారు. పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, బధూరి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. బీజేపీ ఎంపీ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం వహించడంపై బీఎస్పీ ఎంపీ విచారం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన ఈ ఘటనను ఖండించాలని లేఖరాసినా ప్రధాని స్పందించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యలుచేసిన బీజేపీ ఎంపీని సభ నుంచి బహిష్కరించి లీగల్ చర్యలకు ఆదేశించాలని బీఎస్పీ ఎంపీ డిమాండ్ చే్తున్నారు. లేనిపక్షంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని డానిష్ అలీ అల్టిమేటమిచ్చారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్‌గాంధీ ఏదో అన్నారని కోర్టు శిక్షతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేసిన బీజేపీకి సొంత నేతల వ్యాఖ్యలు శ్రావ్యమైన సంగీతంలా వినిపిస్తున్నట్లుంది.