అన్నాచెల్లెలు.. ఓ తండ్రి జయంతి కథ!

ysr-legacy.jpg

వైఎస్‌ఆర్. ఈ మూడక్షరాల మీద తెలుగురాష్ట్రాల్లో రాజకీయం కొత్త టర్న్‌ తీసుకుంటోంది. జగన్, షర్మిలలో ఎవరు వైఎస్‌ఆర్‌కి అసలైన వారసులు అనేది అనే మిలియన్ డాలర్ల ప్రశ్న. 75వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌కి నివాళి అర్పించే కార్యక్రమాల్లో వారసత్వం అనే సబ్జెక్ట్ మళ్లీ తెరమీదికొచ్చింది. ఉమ్మడి తెలుగురాష్ట్రంలో మహా నేతగా ఎదిగి.. సంక్షేమానికి కొత్త భాష్యం చెప్పిన యెదుగూరి సందింటి రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఘనంగా స్మరించుకున్నారు. అధికారం కోల్పోయినా వైఎస్సార్‌ పేరుమీద తమకే పేటెంట్‌ ఉందనేది వైఎస్సార్‌సీపీ వాదన. కానీ ఆయన కూతురు వైఎస్‌ షర్మిల చొరవతో ఈసారి ఏపీ కాంగ్రెస్ కూడా వైఎస్‌ఆర్‌కి ఘనంగా నివాళులు అర్పించింది.

మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జోహార్ వైఎస్‌ఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 75వ జయంతి సభ తెలుగు రాష్ట్రాల్లో బాగా హైలైట్‌ అయింది. ఆరునెలల కిందటి వరకు ఉనికే కరువైన కాంగ్రెస్‌.. సడెన్‌గా వైఎస్సార్‌ జయంతిని అర్భాటంగా నిర్వహించింది. వైఎస్‌ఆర్ వారసత్వాన్ని జగన్‌ నుంచి టేకోవర్ చేయడమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తాజా అజెండాలా కనిపిస్తోంది. కూతురి హాదాలో షర్మిల వైఎస్‌ వారసత్వాన్ని హైజాక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ చెల్లికి అంత అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేదు అన్న వర్గం. వైఎస్ 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది వైసీపీ. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించి అక్కడున్న జనంతో మమేకం అయ్యారు మాజీ సీఎం జగన్.

వైఎస్‌ఆర్‌ జయంతిని ఎవరు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీకి చురకలంటిస్తోంది వైసీపీ. మొన్నటిదాకా వైఎస్‌ను విమర్శించిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు స్మరించుకోవడం ఏంటనేది వైసీపీ ప్రశ్న. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కూడా దివంగత నేతను గట్టిగానే స్మరించుకుంది. ఆయనే బితికుంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేది అంటూ ఆకాశానికెత్తేశారు రాహుల్‌ గాంధీ. వైఎస్సార్‌ వారసత్వాన్ని షర్మిల సమర్ధంగా ముందుకు తీసుకు వెళ్తారనే సంకేతాలిచ్చారు రాహుల్‌. వైఎస్‌లో ఉండే ధైర్యం, ఆయన సిద్ధాంతాలు షర్మిలలో చూశానన్న రాహుల్ కాంప్లిమెంట్ జగన్ శిబిరాన్ని సూటిగా గుచ్చుకుంటోంది. వైఎస్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బాంబుపేల్చారు వైఎస్సార్‌ ఒకప్పటి ఆత్మ కేవీపీ.

అటు.. వైఎస్‌ జయంతి వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ పాదయాత్రే రాహుల్‌గాంధీ జోడో యాత్రకు స్పూర్తి అంటూ ఆయన రేంజ్‌ని మరింత పెంచేశారు. నిన్నటివరకు వైఎస్ వారసత్వం అనేది కొడుకు -కూతురు మధ్య పోరాటంగానే ఉండేది. ఇప్పుడు అన్నాచెల్లెళ్ళ వ్యవహారం రెండు పార్టీలకు చెందిన రాజకీయ అంశంగా మారింది. ఇడుపులపాయలో అన్నాచెల్లెళ్లు వేర్వేరుగా నివాళులు అర్పించడం, విజయమ్మ భావోద్వేగం, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు.. నేతల కామెంట్లు కౌంటర్లు.. ఇవన్నీ వైఎస్ వారసత్వం అంశాన్ని ఎటువైపు తీసుకెళ్లనున్నాయన్నదే ప్రశ్న.

2029 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ చరిష్మా ప్రభావం ఎలా ఉండబోతోందన్నది అప్పుడే ఆసక్తి రేపుతోంది. నేనూ ఆ నాన్న కూతుర్నే.. నన్నూ ఆశీర్వదించండి అంటూ కొంగు చాచి వేడుకుంటున్న చెల్లెలు ఒకవైపు.. నాన్న పేరు నిలబెట్టిన అసలైన వారసుడ్ని నేనే అంటూ అన్న ఒకవైపు. బాబూ వినరా అన్నాచెల్లెళ్ల కథ ఒకటి అన్నట్టుగా మారింది ఏపీ రాజకీయ పరిస్థితి.

Share this post

submit to reddit
scroll to top