బ్లడ్డు.. బ్రీడు.. ఏపీ రాజకీయం చూడు!

ambati-balayya.jpg

మీసాలు మెలేయడం, తొడలుకొట్టడం, రేయ్‌ అంటూ మీదికి దూసుకుపోవడం.. ఇలాంటి సీన్లను బ్యాక్‌టూబ్యాక్‌ చూడాలంటే ఏపీ అసెంబ్లీకి వెళ్లాలి. కొత్త ఒరవడితో అసెంబ్లీ అర్థాన్నే మార్చేస్తున్నాయ్‌ అధికార విపక్షాలు. అంబటిలాంటి అమాత్యులైతే కారాన్ని మించిన వెటకారంతో ఘాటు పుట్టిస్తుంటారు. మా బ్లడ్డు వేరు బ్రీడు వేరు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. అక్కడితోనే ఆగితే అంబటి ఎందుకవుతారు? ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ, నాది తెలుగుగడ్డ అంటూ ఇంకాస్త మసాలా దట్టించారు.

అంబటి ఫ్లోలో చేయలేదీ ట్వీట్‌. పాత హిస్టరీ గుర్తుకొచ్చేలా చేశాడు. ఎందుకంటే సరిగ్గా ఐదేళ్లక్రితం ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు.. మా రాజకీయమే వేరన్న బాట బాలకృష్ణ నోటినుంచి వచ్చింది. ఆర్టిస్టులు సినిమాలకు పరిమితం అవ్వండి.. రాజకీయాలకు రాకండి.. ఇదీ అప్పట్లో నందమూరి బాలకృష్ణ వదిలిన డైలాగ్‌. పేరెత్తలేదుగానీ ఆయన ఎవరిగురించి అన్నారో ఫ్యాన్స్‌కి అర్ధమైపోయింది. దీంతో బాలకృష్ణ కామెంట్స్‌పై పెద్ద దుమారమే చెలరేగింది. బాలకృష్ణ కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్‌తో పాటు ఆ ఫ్యామిలీ ఘాటుగానే స్పందించింది. బాలయ్య వెనక్కితగ్గలేదు. మళ్లీ ఆఊసు ఎత్తలేదు. ఇదిగో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అంబటికి ఆ డైలాగ్‌ గుర్తుకొచ్చింది.

ఆనాడు బాలకృష్ణ తన బ్లడ్డు, బ్రీడు అన్నది తల కులాన్ని చూసుకునేనన్నది మంత్రి అంబటి రాంబాబు విశ్లేషణ. అందుకే తాను కాపు బిడ్డని కాబట్టి అలాంటి ట్వీట్‌ చేయడంలో తప్పేమీ లేదన్నారు. అసలు రాజకీయాల్లో కుల ప్రస్తావన లేకుండా ఉంటుందా అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. బాలయ్య బ్లడ్డు, బ్రీడ్‌ని ఉపయోగించుకుని తండ్రి పార్టీని బావ దగ్గర్నుంచి లాగేసుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని అంబటి ఉచితసలహా కూడా ఇచ్చేశారు. చంద్రబాబు జైల్లో ఉండటంతో ఆయన తర్వాత పార్టీకి పెద్దదిక్కెవరన్న చర్చ జరుగుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎలాగూ సైలెంట్‌ అయిపోయాడు. నారా లోకేష్‌కి అంత అనుభవంలేదు. అందుకే ఆ లోటుని బాలయ్య భర్తీచేస్తే బావుంటుందని పార్టీ తమ్ముళ్లు లోలోపల అనుకుంటున్నారేమోకానీ… అంబటి రాంబాబు మొహాన్నే చెప్పేస్తున్నారు.

Share this post

submit to reddit
scroll to top