పాపం రేవంత్‌.. పాతపార్టీతో కొత్త సవాల్‌!

RevanthReddy-chandrababu.jpg

తెలంగాణలో ఆంధ్రా ‘ముద్ర’ని వదిలించుకున్నా నిను వీడని నీడను నేనే అన్నట్లు రేవంత్‌ని వెంటాడుతున్నారు చంద్రబాబు. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగి ఆ పార్టీ తరపున కొడంగల్‌నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రంగు మార్చేశారు. ఆంధ్ర పార్టీ నాయకుడిగా ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు కాంగ్రెస్‌లోకొచ్చారు. సుడి తిరిగి టీపీసీసీ చీఫ్‌ అయ్యారు. కాంగ్రెస్‌కి ఈసారి కాస్త వేవ్‌ రావటంతో ఆ క్రెడిట్‌ తన ఎకౌంట్‌లో వేసుకోవాలని తహతహలాడుతున్న టైంలో పాతపార్టీకి పోయిన ప్రాణం లేచొస్తోంది. తెలంగాణలో పూర్తిగా తెరమరుగేననుకున్న టీడీపీకి చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత సెటిలర్ల సానుభూతి లభిస్తోంది. దీన్ని ఆ పార్టీ క్యాష్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.

తెలంగాణలో స్థిరపడ్డ కమ్మ సామాజికవర్గం, టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు అరెస్ట్‌కి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. హైదరాబాద్‌లో అక్కడక్కడా నిరసనలతో కదల్లేని స్థితిలో ఉన్న తెలంగాణ టీడీపీకి కాస్త ప్రాణంపోశారు. అంతకుముందే బీసీ నేత జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌కి టీడీపీ తెలంగాణ పగ్గాలు అప్పగించటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి సిద్ధమవుతోంది. 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయిన కాంగ్రెస్‌కి ఈసారి మరోరూపంలో దెబ్బపడేలా ఉంది. కాంగ్రెస్‌-టీడీపీ కూట‌మి తెలంగాణకు వ్యతిరేకమని అప్పట్లో కేసీఆర్‌ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. సెంటిమెంట్‌ దెబ్బతో వరుసగా రెండుసార్లు దెబ్బతిన్న కాంగ్రెస్‌పార్టీ ఈసారైనా కాలూచేయి కూడదీసుకుందామనుకుంది. కానీ టీడీపీ నుంచి మరోరూపంలో కాంగ్రెస్‌ పార్టీ ఆశలకు తూట్లు పడేలా ఉన్నాయి.

రెండునెలలముందే అభ్యర్థులను ప్రకటించి ప్రధానపార్టీలకు బీఆర్‌ఎస్‌ సవాలు విసిరింది. కాంగ్రెస్‌ కాస్త ఆలస్యంగానైనా తొలివిడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. మెడలో మువ్వన్నెల కండువా వేసుకున్నా రేవంత్‌రెడ్డిలో కొందరికి ఇంకా టీడీపీ నాయకుడే కనిపిస్తున్నారు. ఓటుకు నోటు కేసు మాయని పుండులా ఉండనే ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా టీడీపీ సానుభూతిపరుల అత్యుత్సాహం కాంగ్రెస్‌ కొంపముంచేలా ఉంది. రేవంత్‌ని సీఎంని చేస్తే తెలంగాణలో తమ పెత్తనమే నడుస్తుందన్న సంకేతాలిస్తున్నారు కొందరు కమ్మ నేతలు. ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ అదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కాంగ్రెస్‌కి మరో మైనస్‌పాయింట్‌. కాంగ్రెస్‌కి ఓట్లేస్తే చంద్రబాబు సామాజికవర్గం తెలంగాణలో పెత్తనం చేస్తుందన్న అనుమానం రెడ్లలో ఉంది. పైగా బీఆర్‌ఎస్‌ సీట్ల విషయంలో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటంతో రెడ్లు కేసీఆర్‌ విషయంలో సానుకూలంగానే ఉన్నారు.

రేవంత్‌రెడ్డి పేరు చివర కూడా ఆ రెండక్షరాలున్నా సామాజికవర్గం ఎందుకో ఆయన్ని ఆమోదించలేకపోతోంది. ఆయన్ని టీడీపీ అధినేత ప్రతినిధిగానే చూస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూతురు ష‌ర్మిల‌ను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నవారిలో రేవంత్‌రెడ్డి కీలకం. టీపీసీసీ చీఫ్‌పై ఆ విషయంలోనూ రెడ్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. తెలంగాణలో టీడీపీ పోటీతో ఓ వర్గం ఓట్లు చీలిపోయి బీఆర్‌ఎస్‌ లాభపడకూడదన్నది కొందరి ఆలోచన. ఆ ఓట్లు కాంగ్రెస్‌కి మళ్లాలని వేమూరి రాధాకృష్ణలాంటివారు కోరుకున్నా టీడీపీకి ఇది జీవన్మరణ సమస్య. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని తేల్చిచెప్పేశారు. కొన్ని మీడియా సంస్థల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని చాచి లెంపకాయ కొట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పేశాక టీడీపీ వెనక్కితగ్గితే కాంగ్రెస్‌తో కుమ్మక్కైనట్లే. దీంతో రేవంత్‌రెడ్డి కోరుకున్నదానికి పూర్తి రివర్స్‌లో జరగబోతోంది. ఈసారి కాంగ్రెస్‌కొచ్చిన వేవ్‌ ఓట్లరూపంలోకి మారకపోతే ఆ వైఫల్యంలో సింహభాగం రేవంత్‌రెడ్డి ఖాతాలోనే పడబోతోంది.

Share this post

submit to reddit
scroll to top