ఏపీ భవన్‌ వివాదానికి ఎండ్‌ కార్డ్‌?

ap-bhawan.jpg

ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు ఢిల్లీదాకా ఉన్నాయి. ఏపీ భవన్‌ విభజన ప్రక్రియ దాదాపు తొమ్మిదిన్నరేళ్ల నుంచీ పెండింగ్‌లోనే ఉంది. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చీరాగానే ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటుపై దృష్టి సారించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ ఆర్‌అండ్‌బీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. త్వరగా విభజన పూర్తి చేసి కొత్త భవనం కోసం మార్చి లోగా శంకుస్థాపన చేయాలనుకుంటోంది తెలంగాణ సర్కారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది.

ఢిల్లీలో తెలుగువారికి కేరాఫ్‌గా ఉండేది ఏపీ భవన్ మాత్రమే. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు ఎప్పుడు హస్తిన వెళ్లినా ఇక్కడే విడిది చేస్తుంటారు. ఇక్కడ్నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత కొలిక్కిరాని ఆస్తుల పంపకాల్లో ఏపీ భవన్ కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీ ఏపీ భవన్‌పై దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 66 ప్రకారం రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్‌ విస్తీర్ణం 19.73 ఎకరాలు. దీన్ని 58:42 నిష్పత్తిలో లెక్కిస్తే తెలంగాణకు 8.41 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాలు పంచాల్సి ఉంటుంది. ఈ స్థలమంతా ఒకే చోట లేదు. గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలం ఒకదానికొకటి ఆనుకుని మొత్తం 12.09 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. కొంచెం దూరంలో పటౌడీ హౌస్‌ పేరుతో 7.64 ఎకరాల స్థలం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను మొదట్నించీ వ్యతిరేకిస్తూ మొత్తం స్థలం తమకే దక్కుతుందని మాజీ సీఎం కేసీఆర్ తన హయాంలో వాదిస్తూ వచ్చారు. నాటి నైజాం రాజులు నిర్మించిన ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు ప్రతిఫలంగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించినందున తమకే మొత్తం స్థలాన్ని కేటాయించి, ఆంధ్రప్రదేశ్‌కు మరెక్కడైనా కొత్తగా స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో సూచించింది.

రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తులను విభజన చట్టం ప్రకారమే పంచుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్‌ హయాంలో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. 12.09 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని తెలంగాణకు ఇచ్చి, 7.64 ఎకరాల్లో ఉన్న పటౌడీ హౌస్‌ ఏపీకి ఇవ్వాలని సూచించింది. ఏపీ అంగీకరించకపోవటంతో ఢిల్లీలోని ఏపీ భవన్‌పై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదానికి ముగింపు పలికేలా తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది.

Share this post

submit to reddit
scroll to top