ఈ దొర ఏందిరో అంటూ బహుజనుల ప్రతినిధిగా ప్రశ్నించిన మాజీ ఐపీఎస్‌కి ఏమైంది? ఎందుకు ఉన్నట్టుండి స్వరం మారింది? బహుజనులకు రాజ్యాధికారం దక్కబోతోంది. ఇది చెప్పింది కూడా ఆ మాజీ ఐపీఎస్సే. మరి కారులో కూర్చోవడమంటే బహుజనుల చేతికి రాజ్యాధికారం ఇచ్చినట్టా? దళితులను ఏనుగు ఎక్కించినట్టా? బహుజనులకు రాజ్యాధికారం అంటే అర్ధం ఏంటి? అత్యున్నత రాజకీయ పదవిలో కూర్చోవడమేగా. మరో మాటలో చెప్పాలంటే ఓ దళితుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడమేగా. ఆర్ఎస్ ప్రవీణ్ లక్ష్యం గులాబీ జెండాతో సాధ్యమవుతుందనే ఆ పార్టీలో చేరారా?
2021 ఆగస్టులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ పాట పాడారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా అని పాడుతూ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో అనే లైన్ దగ్గరికొచ్చేసరికి స్వరం పెంచారు. ఆ సభలో కూర్చున్న దళిత యువకుల కేరింతలు అప్పట్లో రీసౌండ్‌లో వినిపించాయి. మరిప్పుడు కేసీఆర్ గూటికి చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఏ పాట అందుకుంటారు. ఏ పల్లవి ఆలపిస్తారన్నదే ప్రశ్న!
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పక్కా దళితవాదిగా గుర్తింపు ఉంది. స్వేరోస్ సంస్థ పెట్టి దళిత యువతకు చేరువయ్యారాయన. ఒకప్పుడు తాను దొరల పాలనకు, దొరలకు వ్యతిరేకం అని చెప్పుకున్నారు. ఆ స్లోగన్ దళితులకు చాలా బాగా నచ్చింది. పోయిన ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయి ఉండొచ్చు గానీ.. ప్రవీణ్ మాటలతో ప్రేరణ పొంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన దళిత యువకులు ఎందరో! బీఆర్ఎస్ పాలనలో ప్రతి వ్యవస్థలో అవినీతి జరిగిందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.
బుద్దుడికి బోధి చెట్టుకింద జ్ఞానోదయం అయింది. మరి ఆర్‌ఎస్‌పీకి ఏ మహావృక్షం కింద జ్ఞానోదయం అయిందని ఇలా గులాబీ కండువా కప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్ధులు. దళితులను మోసం చేసిన పార్టీగా బీఆర్‌ఎస్‌ని నిందిస్తూ దళిత యువత మద్దతు కూడగట్టుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. మరి ఆయన ఆ కేసీఆర్ నాయకత్వాన్నే నమ్ముకున్న వేళ దళిత సమాజం ఆర్ఎస్ ప్రవీణ్ వెంట నడుస్తుందా? ఆయన్ని దళిత సమాజం ఇంకా విశ్వసించే పరిస్థితి ఉందా? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలకడగానే ఉన్నారా అన్న ప్రశ్న దళితవర్గాల నుంచే వస్తోందిప్పుడు.
సర్వీస్‌కు వీఆర్ఎస్ ఇచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ ద్వారానే రాజ్యాధికారం అని చెప్పి, అప్పటి అధికారపార్టీని తూలనాడి, ఎన్నికల్లో ఓడిపోగానే మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వారం గడిచిందో లేదో ఏనుగు దిగి కారెక్కారు. ఆర్ఎస్ ప్రవీణ్ నిలకడ, రాజకీయ పరిపక్వత ఇంతేనా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఐపీఎస్‌గా 30 ఏళ్ల పాటు సర్వీస్‌లో ఉన్నారు. మరి బహుజనుల చేతిలో రాజ్యాధికారం పెట్టేందుకు 30 నెలలు కూడా రాజకీయం చేయలేకపోయారా? పోరాడలేకపోయారా? యుద్ధానికి ముందే చేతులెత్తేశారా?
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే తెలంగాణకు భద్రత ఉండదని అన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. మరి ఏ భద్రత కనిపించిందని ఇవాళ గులాబీ కండువా కప్పుకున్నారు? ఈ మూడు నెలల్లో బీఆర్ఎస్ ఏం పోరాటాలు చేసింది, ఆ పార్టీలో ఏం మార్పు కనిపించింది? తాను ఎక్కడ ఉన్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటానంటారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. మరి ఈ మాటలను అదే బహుజన సమాజం నమ్ముతుందా? బీఎస్పీ వదిలి బీఆర్ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ తన జాతికి ఆ నమ్మకాన్ని కలిగించగలరా?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం రాజకీయంగా పదవులు అనుభవించడమా? బలమైన పార్టీలో ఉంటే కనీసం ప్రజాప్రతినిధిగానైనా గెలవొచ్చనేదే ఆయన లక్ష్యమా? బీఆర్ఎస్‌లో చేరింది అందుకేనా? నిజానికి తాను బీఆర్ఎస్‌లో చేరింది పదవుల కోసం కాదు అని క్లారిటీ ఇచ్చారు. అధికారం కోసమే అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే చేరి ఉండేవాడినని చెప్పుకున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకో ఆఫర్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా వేలమంది నిరుద్యోగ యువతకు న్యాయం చేసే అవకాశమున్నా ఆ అవకాశాన్ని ప్రవీణ్ తిరస్కరించారు. తమకో దారి చూపుతారనుకున్న మార్గదర్శి తానే దారి తప్పారని బాధపడుతోంది దళిత యువత.