20 శాతం ట్యాక్స్ కట్టడం భారమా?
12.5 శాతం పన్ను కట్టడం భారమా?
ఒకటో క్లాసు పిల్లోడికైనా అర్ధమైపోతుంది కదూ. కానీ నిర్మలమ్మ మార్క్ బడ్జెట్ పండితులకు కూడా పరీక్షపెట్టేలా ఉంది. ఎందుకంటే 20శాతం కంటే 12.5 శాతం ట్యాక్సే భారమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ విచిత్రమైన లాజిక్‌తో లబోదిబోమంటోంది. పన్ను రేటు తగ్గించి ఇండెక్సేషన్ తీసేయడంతో వచ్చిన తంటా ఇది. నిర్మాణరంగమే కాదు ఇల్లు అమ్ముకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ పన్ను పోటు పడిందిప్పుడు. పేరుకేమో ఇళ్ల అమ్మకాలపై పన్నుని 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించినట్టే కనిపిస్తోంది. కానీ పరిశీలించి చూస్తే 20 శాతం కంటే 12.5 శాతం పన్ను కట్టడమే పెనుభారమవుతోంది.
ఉదాహరణకు ఓ డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని పదేళ్ల క్రితం 10 లక్షలు పెట్టి కొన్నారనుకుందాం. ఆ ఇంటి ప్రస్తుత మార్కెట్ ధర 18 లక్షలు అనుకుందాం. ఇప్పుడు ఆ ఇంటిని 20 లక్షలకు అమ్మితే వచ్చే లాభం జస్ట్ 2 లక్షలే. దాని మీదే 20 శాతం పన్ను కట్టేవారు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. బడ్జెట్ తర్వాత ఈ 20 శాతం పన్నుని 12.5 శాతానికి తగ్గించారు. అదే సమయంలో ఇండెక్సేషన్‌ని కూడా తీసేయడంతో స్థిరాస్తి వ్యాపారులు తలపట్టుకుంటున్నారు. ఇండెక్సేషన్ తీసేయటంతో కొన్ని ధరకి అమ్మిన ధరకు మధ్య ఉన్న తేడాపై పన్ను కట్టాలి. ఎన్నేళ్లకిందట కొన్నా, మార్కెట్ ధర ఎంతున్నా ఎంతకు కొన్నారు, ఎంతకు అమ్మారనేదానినే కేంద్రం కాలిక్యులేట్ చేస్తోంది. అంటే అప్పుడెప్పుడో 10లక్షలకు కొని 20లక్షలకు అమ్మితే కేంద్రం దృష్టిలో 10లక్షలు లాభం వచ్చినట్లే. ఆ మొత్తంమీద చచ్చినట్లు 12.5 శాతం ట్యాక్స్ కట్టాల్సిందే!
ఇల్లు అమ్ముకోవాలనుకునే వారికి, రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం దిక్కుమాలని నిర్ణయం మోయలేని భారమవుతుంది. కేంద్ర బడ్జెట్‌లో ఈ ఇండెక్సేషన్ తీసేయడం వల్ల అంతిమంగా ఇల్లు కొనాలనుకునే వారిపైనే భారం పడబోతోంది. ఇల్లు అమ్ముకునే వాళ్లు తాము కట్టాల్సిన ట్యాక్స్‌ని కూడా లెక్కేసుకునే ఓ రేటు ఫిక్సవుతారు. దీంతో 50 లక్షలకు ఇల్లు వచ్చేస్తుందని ఆశించినవారు అదనంగా మరో 10 లక్షల భారం మోయాల్సి వస్తుంది. దీంతో ఇల్లు కొనాలనుకునేవారు వెనక్కితగ్గుతారు. ఎల్లకాలం అలాగే ఉండకపోయినా ఈ భారాన్ని భరించేందుకు ముందుకొచ్చేదాకా మార్కెట్ స్తబ్దంగానే ఉంటుంది. లోన్‌కు వెళ్లే వాళ్లు ఇంకాస్త ఎక్కువ రుణభారాన్ని మోయాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా ఇది రియల్ ఎస్టేట్ రంగంపై భారీ ప్రభావమే చూపబోతోంది.