రేవంత్‌రెడ్డి అనే నేను..

revanthreddy2.jpg

నాలుగురాష్ట్రాల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణ గెలుపే ప్రాణవాయువులా పనిచేసింది. సీఎం అభ్యర్థి ఎవరని 48గంటల పాటు కాస్త హైడ్రామా జరిగినా కాంగ్రెస్‌ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఏరికోరి మరో పొరపాటు చేయలేదు. అనుమల రేవంత్‌రెడ్డినే సీఎల్పీ నేతగా ప్రకటించింది. భట్టి అలిగారనో, ఉత్తమ్‌ అడిగారనో సీనియర్లను సీట్లో కూర్చోబెడితే ఏం జరుగుతుందో పార్టీకి స్వానుభవంమీద బోధపడింది. అందుకే వాళ్లిద్దరినీ చెరోవైపు కూర్చోబెట్టుకుని మరీ సీఎం అభ్యర్థిని ప్రకటించారు కాంగ్రెస్ పెద్దలు.

కేవలం కేసీఆర్‌ మీదున్న అసంతృప్తితోనో, రెండుసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణలోజెండా ఎత్తేసే పరిస్థితుల్లో ఉన్న పార్టీ ఈరోజు అధికారపీఠం ఎక్కిందంటే రేవంత్‌రెడ్డే కారకుడన్న విషయం సామాన్య కార్యకర్తకు కూడా తెలుసు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా మరో మెట్టు ఎదగడానికి కాంగ్రెస్సే కారణమైఉండొచ్చు. కానీ ఆపసోపాలు పడుతూ ఇన్ని మెట్లు ఎక్కగలుగుతుందో లేదోననుకున్న కాంగ్రెస్‌ ఇంతెత్తున ఎగసిపడిందంటే అది రేవంత్‌రెడ్డి నాయకత్వం వల్లే.

చూశారా చూశారా.. అదే కేసీఆర్‌ మళ్లీ గెలిచి ఉంటే సీఎం ఎవరనే చర్చే ఉండేది కాదు. ఆయన్నో ఆయన కొడుకునో లెజిస్లేచర్‌పార్టీ నేతగా ఎన్నుకుని ఉండేవాళ్లు. ఎమ్మెల్యేలంతా నోరెత్తకుండా చెయ్యెత్తేవాళ్లని కొందరంటున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగింది అదే. రాజకీయం, పాలన అంతా ఆ కుటుంబంచుట్టే. అందుకే రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించేదాకా జరిగిన ఈప్రక్రియని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్నే అంతా కోరుకుంటున్నారు. చర్చ జరగాలి. అభ్యంతరాలు ఉండాలి. అభిప్రాయాలు బలంగా చెప్పగలగాలి. అప్పుడే కదా ప్రజాస్వామ్యానికి అర్ధం.

కాలేజీ రోజుల్లోనే ఏబీవీపీ స్టూడెంట్ లీడర్‌గా తన ముద్రవేసిన రేవంత్‌రెడ్డికి భవిష్యత్తులో ఏం కావాలన్నదానిపై ఓ లక్ష్యం ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, కష్టనష్టాలు వచ్చిపడ్డా అన్నిటినీ తట్టుకుని చివరికి ముఖ్యమంత్రి అయ్యారు. పదిహేడేళ్లక్రితమే ఇండిపెండెంట్‌గా పోటీచేసి జడ్పీటీసీగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగారు.2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్‌గా గెలిచిన చరిత్ర ఆయనది. చంద్రబాబు కళ్లలోపడి టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కొన్ని నెలల్లోనే మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి సత్తాచాటటం సాధారణ విషయమేం కాదు.

2017లో కాంగ్రెస్‌లోచేరి రెండేళ్లక్రితం పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి ఆ పార్టీ తలరాతను మార్చేశారు. కేసీఆర్‌ను గద్దె దించుతానని ఎనిమిదేళ్ల క్రితం చేసిన శపథాన్ని ఇలా నెరవేర్చుకున్నారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసులో అరెస్టయ్యారు రేవంత్‌రెడ్డి. అప్పట్లోనే తెలుగురాష్ట్రాల్లో ఆయన సంచలనంగా మారిపోయారు. తనను జైలుపాలుచేసినా కేసీఆర్‌ని కుర్చీ దించుతానని మీసం మెలేసి శపథం చేసిన పాలమూరు పులిబిడ్డ దాన్ని నెరవేర్చుకోవడం అనితరసాధ్యం. కోర్టు అనుమతితోకూతురి పెళ్లికి ఓ అతిథిగా వచ్చి వెళ్లాల్సి వచ్చినా రేవంత్‌రెడ్డి కుంగిపోలేదు. వేరే నేతలైతే అస్త్రసన్యాసం చేయడమో, ప్రత్యర్థులకు తెల్లజెండా చూపడమో చేసేవాళ్లు. కానీ రేవంత్‌రెడ్డి జగమొండి. అందుకే రాజుకంటే బలవంతుడైన కేసీఆర్‌ని ఇంత అవమానకరంగా ఇంటికి సాగనంపగలిగారు.

ఓటుకునోటు కేసుతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. హైదరాబాద్‌లో తట్టాబుట్టా సర్దేసుకున్నారు. తనకంటే సీనియర్లు కండువాలు మార్చేసినా సింహం సింగిల్‌ అన్నట్లు రేవంత్‌రెడ్డి గట్టిగా నిలబడ్డారు. ఆయన ఒంటరిపోరాటానికి సిద్ధపడ్డా టీడీపీ అధినాయకత్వం నైతిక మద్దతు ఇవ్వలేకపోయింది. కబుర్లు చెప్పేవాళ్లు తప్ప పార్టీని గట్టెక్కించే సమర్ధులు కరువైన కాంగ్రెస్‌కి రేవంత్‌ ఆపద్బాంధవుడిలా కనిపించారు. 2017 అక్టోబర్ 30న రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటినుంచీ రేవంత్‌రెడ్డి పొలిటికల్ కెరీర్ మరింత పుంజుకుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌ కుటుంబంపై ఆయన దూకుడు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెంచింది.

2021లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో రేవంత్‌రెడ్డికి తెలంగాణ పగ్గాలు అప్పగించింది. పార్టీనేతలు పూర్తిస్థాయిలో సహకరించకపోయినా, కుమ్ములాటలు అడుగడుగునా అడ్డంపడ్డా రేవంత్‌రెడ్డి వెనక్కితగ్గలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం ఆయన చుట్టే తిరిగింది. రేవంత్‌ మైకుపడితే కేడర్‌ పూనకమొచ్చినట్లు ఊగిపోయింది. కేసీఆర్‌ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా పని చేశారు. పార్టీ సాయంకోసం చూడకుండా సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా సీనియర్లను కలుపుకుని కాంగ్రెస్‌ని తెలంగాణలో అధికారంలోకి తెచ్చారు.

ఆయనకంటే సీనియర్లున్నారనో, భట్టిలాంటి ఎస్సీ నేతను తెరపైకి తెస్తే బావుంటుందనో కాంగ్రెస్‌ అనుకోలేదు. రేవంత్‌రెడ్డి లేకుంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధ్యమయ్యేదే కాదని కాంగ్రెస్‌ పెద్దలందరికీ తెలుసు. అందుకే ఆయన ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. సీనియర్లు పోటీపడ్డా రేవంత్‌రెడ్డినే పీఠంపై కూర్చోబెట్టింది. మరికొన్ని నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలున్నాయి. ఈ సమయంలో రేవంత్‌రెడ్డిలాంటి నాయకుడు అంత అవసరమో పార్టీకి తెలుసు. సీఎం సీట్లో కుదురుకోవడానికి, తన నాయకత్వం పటిమ నిరూపించుకోవడానికి రేవంత్‌రెడ్డికి ఈ సమయం చాలు. కష్టాలుపడ్డోడికే తెలుస్తుంది కుర్చీ విలువ. కచ్చితంగా తెలంగాణపై రేవంత్‌రెడ్డి ముద్ర మరింత బలంగా ఉండబోతోంది.

Share this post

submit to reddit
scroll to top