కేసుపెట్టి వేధించినవాళ్లే ఒళ్లో కూర్చోబెట్టుకోవచ్చు. చచ్చినా మీ మొహం చూడనన్న ఆయనే ఇంటికొచ్చి తలుపుతట్టొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారేదే రాజకీయం. ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధర్నాతో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారేలా కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమిప్రభుత్వం వైసీపీ టార్గెట్‌గా దాడులకు తెగబడుతోందని ఢిల్లీలో మాజీ సీఎం జగన్ చేసిన ధర్నా కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న ఇండి కూటమి నేతలు జగన్మోహన్‌రెడ్డికి మద్దతు పలకడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
2012లో కాంగ్రెస్‌ని కాదనుకుని కొత్త పార్టీ పెట్టి విభజిత ఏపీకి సీఎం అయ్యారు జగన్. అలాంటి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వేదికగా నిరసన చేపడితే కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతివ్వడం రాజకీయపక్షాలకు, విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘోర ఓటమితో ఆత్మరక్షణలో పడ్డ జగన్మోహన్‌రెడ్డిని తమ కూటమిలోకి లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందా అనే చర్చ మొదలైంది. ఢిల్లీలో జగన్మోహన్‌రెడ్డి ధర్నాకు కాంగ్రెస్ మినహా ఇండి కూటమిలోని కీలక పక్షాలన్నీ వచ్చాయి. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ, మహారాష్ట్ర నుంచి శివసేన ఉద్ధవ్‌వర్గం, తమిళనాడు నుంచి వీసీకే, పశ్చిమబెంగాల్ నుంచి టీఎంసీ తదితర పార్టీలు జగన్ ధర్నాకు మద్దతు తెలిపాయి. ఇన్నాళ్లూ ఎన్టీఏ పక్షంగా ఉండి కొన్నాళ్లుగా అంటీముట్టనట్లు ఉంటున్న ఏఐడీఎంకే కూడా వైసీపీ ఆందోళనకు మద్దతు తెలిపింది.
జగన్మోహన్‌రెడ్డికి సంఘీభావం పలకటంతో ఆగలేదు ఇండి కూటమి నేతలు. తమతో కలిసి నడవాలని భాగస్వామ్యపక్షాలు కోరడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలెవరూ ప్రత్యక్షంగా జగన్‌ని కలవకున్నా.. ఆయన్ని దువ్వేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందా అనే ప్రచారానికి ఈ పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. అటు జగన్ మనసులో, ఇటు కాంగ్రెస్ అధిష్ఠానం మనసులో ఏముందోకానీ ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్ ఎటు వైపన్నదే ఆసక్తిరేపుతున్న అంశం. ఎందుకంటే ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల అన్న జగన్‌మీదే పోరాడుతున్నారు. బీజేపీకి బీటీమ్ అంటూ వైసీపీపై పలుమార్లు ఆరోపణలు కూడా గుప్పించారు. ఢిల్లీలో జగన్ ధర్నాపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో జగన్‌పై షర్మిల విమర్శలు గుప్పిస్తే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం ఢిల్లీలో వైసీపీ ధర్నాకు మద్దతివ్వడం కొత్తచర్చని తెరపైకి తెచ్చింది. ఒకవేళ జగన్మోహన్‌రెడ్డిని దగ్గరికి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండటమే నిజమైతే.. అనుకోకుండా ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందన్నదే అసలు పాయింట్.