ప్రత్యర్థి ఎవరయినా తగ్గేదే లే. వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా దెబ్బకి పెద్ద పెద్ద జట్టు కూడా తోకముడుస్తున్నాయి. ప్రత్యర్థులముందు భారీ లక్ష్యాలు పెడుతున్న దక్షిణాఫ్రికా భారత జట్టు పరాక్రమంతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో దక్షిణాఫిక్రా జట్టుని మన జట్టు చిత్తుచిత్తుగా ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఈ వన్డే ప్రపంచకప్‌లో ఒక్కటంటే ఒక్క ఓటమిని చూడలేదు. ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ భారీ ఆధిక్యంతో గెలిచి సత్తా చాటింది భారత్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది.
327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఏ దశలోనూ టీమిండియాకి పోటీ ఇవ్వలేకపోయింది. కనాకష్టంమీద 27.1 ఓవర్లు ఆడి 83 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో టాప్ స్కోర్ 14 పరుగులే. భారత్ బౌలర్లలో స్పిన్ మాయాజాలంతో జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. షమి, కుల్‌దీప్ చెరి 2 వికెట్లు తీసుకుంటే, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డు(49 సెంచరీలు) తన 35వ పుట్టిన రోజున అందుకున్నాడు.