ఆ గొంతు ఇక మోగలేదు.. మూగబోవడమే!

Tmc-Mp-Mahua-Moitra.jpg

పార్లమెంటులో ఆమె పూనకం చూసి ముచ్చటపడనివారు ఉండరు. అధికారపార్టీ నేతలు కూడా ప్రసంగానికి అడ్డం పడాలంటే జంకేటంత వాగ్ధాటి ఆమెది. ఎందుకంటే ఆవేశంగా నోరు పారేసుకోదు. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌కి బాగా ప్రిపేర్‌ అయి వస్తుంది. అనర్గళంగా మాట్లాడుతుంది. లాజిక్‌లు లేవనెత్తుతుంది. ఆమె ప్రిపేరేషన్‌ చూస్తే అందరిక చూడముచ్చటేస్తుంది. తనలా తామూ మాట్లాడాలని అంతా అనుకునేలా ఉంటుంది ఓవరాల్‌గా ఆమె పర్‌ఫామెన్స్‌. కానీ ఎంత సబ్జెక్ట్‌ ఉండీ ఏం లాభం. శకునంచెప్పే బల్లి కుడితిలో పడినట్లే ఉందిప్పుడు.

పేరుకు టీఎంసీ ఎంపీ అయినా యావత్‌ ప్రతిపక్షానికీ తనో బ్రహ్మాస్త్రం. కానీ అవతల ఉన్నది బీజేపీ. ఆవలిస్తే అన్నీ లెక్కపెట్టేసే పార్టీ. అందరి ప్రత్యర్థుల్లా ఆమెపై ఐటీ దాడులు జరగలేదు. ఈడీ రంగంలోకి దిగలేదు. ఏ సీబీఐ కేసో పెట్టలేదు. మనిషన్నాక కాస్తంత కళాపోషణే కాదు తెరచాటు బలహీనతలు కూడా ఉంటాయి. ఆ మహిళా ఎంపీ బలహీనతను కనిపెట్టింది. దాంతోనే ఇప్పుడో ఆట ఆడుకుంటోంది. ఆ పాయింట్‌ని క్యాచ్‌చేస్తున్నారని, తననిలా నైతిక బోనులో నిలబెట్టి ప్రశ్నలవర్షం కురిపిస్తారని కల్లో కూడా ఊహించని ఆ ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ ఇప్పుడు ఫ్రస్టేషన్‌లో పడింది. మనం మాట్లాడుకునేది జగమెరిగిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా గురించి.

పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలు ఆ ఎంపీ నియోజకవర్గంగురించి అయ్యుండాలి. లేదంటే దేశంలో ప్రధాన సమస్యకు సంబంధించి ప్రజల పక్షాన వివరణ అడిగేవి అయ్యుండాలి. కానీ ఆమె ప్రశ్నలు కార్పొరేట్‌ పెద్దలకు అమ్ముడుపోవడమే పెద్ద విషాదం. మల్లెపూవులా స్వచ్ఛంగా కనిపించే ఆమె గొంతు ఈ ఆరోపణలతో అపవిత్రమైపోయింది. ముందు బుకాయించింది. తర్వాత అవునంటూ అనివార్యంగా ఒప్పుకుంది. పార్లమెంట్‌ సభ్యురాలు ఎవరికో లాగిన్‌ ఇచ్చేయొచ్చా? తన తరపున ఆన్‌లైన్‌లో మరెవరో ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించవచ్చా? తప్పేముందని బుకాయించడానికి అవకాశమేలేదు. సబ్జెక్ట్‌ కోసం, మరింత లోతుగా అడిగేందుకు నిష్ణాతుడికి లాగిన్‌ ఇచ్చానని చెప్పినా ఎవరూ ఆమోదించరు.

కోల్‌కతాలో ఎకనమిక్స్, అమెరికాలో మ్యాథ్స్ పీజీ, న్యూయార్క్ జేపీ మోర్గాన్‌లో ఉద్యోగం. లండన్‌లో కొన్నాళ్లు కొలువు. చివరికి అన్నీ వదిలేసి 15ఏళ్లక్రితం రాజకీయాల్లోకి వచ్చిన 50 ఏళ్ల మహువా మొయిత్రా మొన్నటిదాకా చాలామందికి ఆదర్శం. ఇప్పుడు తనలా మాత్రం ఉండకూడదనేంత వైరుధ్యం. భవిష్యత్తులో అద్భుతాలేమన్నా జరిగిపోయి బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకొస్తే ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయేదేమో. కానీ విలాస జీవితం, ప్రలోభాల పర్వం ఆమె నైతికతను లొంగదీసుకున్నాయి. ఆ మహిళా ఎంపీ గొంతుని హైజాక్‌ చేశాయి. ఆన్‌లైన్‌లో పార్లమెంట్‌లో అడగాల్సిన ప్రశ్నలను ఎవరో బయటివ్యక్తి అడిగేశారు. దుబాయ్ నుంచి పదేపదే లాగిన్ అవుతూ తనకు ఇష్టమున్న ప్రశ్నలు వేశాడు. అవి మహువా ప్రశ్నలే అనుకున్నారు. కానీ నిజం దాగదుగా. పాయె పరువుపాయె!

నమ్ముకున్న ఓ లాయర్‌ మహువా మొయిత్రా కొంపముంచాడు. అతనితో ఆమెకు కొన్నాళ్లు సహజీవనం నడిచింది. విడిపోయాక అతని ప్రతీకారం ఇలా ఉంటుందని ఆమె ఊహించలేకపోయింది. ఆన్‌లైన్ ప్రశ్నల కోసం తానేమీ పెద్దగా కానుకలు తీసుకోలేదని చెప్పినా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆమె వ్యక్తిత్వం పాతాళానికి జారిపోయింది. ఖరీదైన ఫర్నీచర్‌కోసమో, మేకప్‌ కిట్లకోసమో లాగిన్‌ ఇచ్చేశాను తప్ప వేరే ఏమీ ఆశించలేదంటే ఆమె వాదన నైతిక విలువల కమిటీ ముందు నిలవదు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి తనను విచారించే హక్కు లేదని దబాయిస్తూనే హాజరైంది. చెత్తప్రశ్నలు అడుగుతున్నారంటూ విసురుగా మధ్యలోనే బయటికి వచ్చేసింది.

కూల్‌గా, స్థితప్రజ్ఞతతో కనిపించే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాలో ఇప్పుడు కనిపిస్తోంది కేవలం ఫ్రస్ట్రేషనే. ఎథిక్‌ కమిటీ ముందు హాజరై విసవిసా బయటికొస్తున్న మహువాని మీ కళ్లల్లో నీళ్లొస్తున్నట్లున్నాయని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగానే ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపంతో కళ్లు వెడల్పు చేసింది. ఇన్నాళ్లూ మనంచూసిన ఆ డైనమిక్‌ ఎంపీనేనా తను? ఇప్పటిదాకా ఆమెను వెనకేసుకొచ్చిన మమతా బెనర్జీ ఇక మహువాని క్షమించకపోవచ్చు. టీఎంసీ ఎంత తమ కూటమిలో భాగమైనా కాంగ్రెస్‌ ప్లస్‌ ఇతర పక్షాలు కూడా ఆ ఎంపీ తప్పేమీ లేదని సమర్ధించకపోవచ్చు. పార్లమెంట్‌లో ప్రతిధ్వనించే ఆమె గొంతు భవిష్యత్తులో గతంలోలా గట్టిగా లేవకపోవచ్చు. ఎవరో చేసిన కుట్రకాదు. ఇది తన స్వయంకృతం. స్వీయ తప్పిదాల ఫలితం.

Share this post

submit to reddit
scroll to top