చైనాలో రివ‌ర్స్‌.. జనాభాలో భారత్‌ NO-1

population.jpg

ప్రపంచంలో అత్యధిక జ‌నాభా ఉన్న దేశంగా ఇప్పటిదాకా చైనాదే రికార్డ్‌. ద‌శాబ్ధాలుగా ఏ దేశం కూడా ఈ విష‌యంలో దాని ద‌రిచేర‌లేదు. ఆ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు మనం మాత్రమే పోటీప‌డుతూ వ‌చ్చాం. ఇప్పుడు డ్రాగ‌న్ కంట్రీలో జ‌నాభా పెరుగుద‌ల నెమ్మదించింది. విచిత్రంగా జ‌నాభా సంఖ్య త‌గ్గుతూపోతోంది. చైనాలో జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 తర్వాత ఇదే తొలిసారి. 2021 జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా ఎనిమిదిన్నర ల‌క్షలు తగ్గిందని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్ తేల్చింది.

చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదుకావడం ఆ దేశ జ‌నాభాపై ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదుకావ‌డం ఇది రెండోసారి. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లుగా గ‌ణాంకాలు తేల్చాయి. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఈ ప‌రిస్థితికి ప్రధాన కార‌ణం. 2021లో చైనాలో 1.062 కోట్ల మంది పుడితే 2022లో ఆ సంఖ్య 95.6 లక్షలకు త‌గ్గింది. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో అసాధారణంగా 6.77 శాతానికి పడిపోయింది. దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య 62 శాతం ఉండటం చైనా ముందున్న మరో సమస్య. చైనాలో ఆరు పదుల వయసు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. అందుకే దేశ భవిష్యత్తుపై చైనా కలవరపడుతోంది. పిల్లల్ని క‌నాల‌ని యువ‌జంట‌ల‌ను ఎంకరేజ్‌ చేస్తోంది,

అంచనాల కంటే ముందుగానే భార‌త్ జ‌నాభాలో చైనాని దాటేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం భారత్‌ చైనాని మించిపోయింది. 2050కల్లా భారత్ జ‌నాభా 166.8 కోట్లకు చేరుతుందని అంచనా. అదే స‌మ‌యంలో చైనా మాత్రం 131.7 కోట్ల జ‌నాభాకే ప‌రిమిత‌మ‌వుతుంది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అంచనాల ప్రకారం 2022 చివరినాటికే భారత్‌ జనాభా 141.7 కోట్లు. ఇప్పుడది దగ్గరదగ్గర 143 కోట్లు. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంది. మరోవైపు ప్రపంచ జనాభా కూడా ఈమ‌ధ్యే 800 కోట్ల మైలురాయిని దాటింది. 1974లో 400 కోట్లున్న ప్రపంచ జనాభా 48ఏళ్లలోనే రెట్టింపైంది.

Share this post

submit to reddit
scroll to top