నాలుగు వికెట్లు పడ్డాక న్యూజిలాండ్ వికెట్ల దగ్గర పాతుకుపోతుందేమో. అంత పెద్ద టార్గెట్‌ని ఛేదిస్తుందేమోనని కలవరం. కానీ అది కాసేపే. క్రీజ్‌లో డారిల్ మిచెల్ ఉన్నంతసేపే. 134 పరుగులు చేసిన మిచెల్.. షమి బౌలింగ్‌లో జడేజా చేతులకు చిక్కటంతో కివీస్ ఓటమి ఖరారైపోయింది. టపటపా వికెట్లు పడటంతో 48.5 ఓవర్లకు న్యూజిలాండ్ కథముగిసింది. 398 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 327 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై వాఖండే స్టేడియంలో అదరగొట్టేసిన రోహిత్‌సేన ఫైనల్స్‌కి దూసుకెళ్లింది.
న్యూజిలాండ్ వెన్నువిరిచి భారత్‌కి విజయాన్ని ఖాయంచేశాడు షమి. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 6వికెట్ల నష్టానికి 300పరుగుల మార్క్ దాటిన కివీస్ ఆశల్ని వమ్ముచేశాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షమి.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్ జట్టు 397 పరుగులుచేసింది. విరాట్ కోహ్లి(118), శ్రేయాస్ అయ్యర్ (105) సెంచరీలతో స్కోరును పరుగులు పెట్టించారు. 80పరుగులు చేసిన శుభమన్‌గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాక మిగిలిన ఆటగాళ్లు క్రీజ్‌లో పాతుకుపోయారు. 20 బాల్స్‌లోనే 2 సిక్సర్లు, 2 ఫోర్లతో మన ఇన్నింగ్స్‌కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు కేఎల్ రాహుల్.