టెర్రరిస్ట్‌ మర్డర్‌.. భారత్‌పై కెనడా నిందలు!

canada-bharath.jpg

Prime Minister Modi With Canadian Pm Justice Trudo

ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయానికి ఖలీస్తానీ ఉగ్రవాదం వేళ్లూనుకుంది. ఇందిరాగాంధీ హత్యతో ఆ వేర్పాటువాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కానీ దశాబ్ధాలు గడిచినా ఖలిస్తాన్‌ ఉగ్రవాదం ఏదోరూపంలో తెరపైకి వస్తూనే ఉంది. కెనడా మెతకవైఖరితో ఆ దేశం ఖలిస్తానీ ఉగ్రవాదులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోందని భారత్‌ ఆందోళన వ్యక్తంచేస్తూ వచ్చింది. ఈమధ్య జరిగిన జి20 సదస్సులోనూ కెనడా ప్రధానికి మన దేశం ఇదే విషయం చెప్పింది. పాముల్ని పాలుపోసి పెంచితే మీకే నష్టమని సుతిమెత్తగానే హెచ్చరికలు చేసింది. అయినా కెనడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడంలేదు.

మన దేశం బయట జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హత్య విషయంలో కెనడా సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలీస్థానీ ఉగ్రవాది హత్య వెనుక భారత హస్తం ఉందని ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా భారత్ దౌత్యవేత్తని బహిష్కరించింది. భారత్- కెనెడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ఒట్టావాలోని భారత్ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బహిష్కరించి అగ్నికి ఆజ్యం పోసింది. కెనడా పార్లమెంట్‌లోని ప్రతిపక్ష నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు కెనడా ప్రధాని.ఆ హత్యతో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయంటున్నారు ట్రూడో. హరదీప్ సింగ్ నిజ్జార్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. మన దేశంలోని కొన్ని ఉగ్రదాడుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. జూన్ 18న కెనడాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఖలిస్థాన్‌ వేర్పాటువాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని భారత్ కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రూడోతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోడీ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను ఇటీవల కెనడా నిలిపివేసింది.

Share this post

submit to reddit
scroll to top