అప్పాయింట్‌మెంట్‌కోసం పడిగాపులు కాయడానికి ఆయనేం కేసీఆర్ కాదు. తలుపులు తెరుచుకుంటాయో లేదో అనుకోవడానికి అది తెలంగాణ భవన్‌కాదు. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని ఒప్పుకోవడం లేదేమోగానీ, పార్టీ ఎమ్మెల్యేలకు తత్వం బోధపడుతోంది. అగ్రనాయకత్వం హూంకరించినా, మొండికేసినా నడుస్తుంది. కానీ పంతాలకు పోతే ప్రజల్లో పలుచనయ్యేది ఎమ్మెల్యేలే. అందుకే నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం సామాన్యులకు పెద్దగా ఆశ్చర్యమేమీ కలిగించలేదు. పైగా ఆ నలుగురూ బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వానికి బలమైన పునాదులున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలే కావడం మరో విశేషం.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్‌రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. పార్టీ అధిష్ఠానం ఈ పరిణామంపై కన్నెర్ర చేసినా, నియోజకవర్గాల సమస్యలపైనే కలిశామని తేలిగ్గా చెప్పేశారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకే కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నా.. కాంగ్రెస్ ఎంతోకాలం అధికారంలో ఉండదని హెచ్చరికలు చేస్తున్న బీఆర్‌ఎస్ అగ్రనేతలకు ఇది చెంపపెట్టేనని చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. నలుగురూ చెప్పింది ఒకేమాట. ప్రొటోకాల్, నియోజకవర్గాల అవసరాలు, సెక్యూరిటీ తగ్గింపులాంటి అంశాలపైనే కలిశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కలవడమే కాదు అవసరమైతే తరచూ కలుస్తానంటున్నారు కొత్త ప్రభాకర్‌రెడ్డి. సీఎంని కలిసిన నలుగురిలో ముగ్గురు ఒకప్పుడు కాంగ్రెస్‌వారే కావటంతో బీఆర్‌ఎస్ కొంత అసహనంతో ఉంది.
రేవంత్‌రెడ్డిని ఎలా కలుస్తారని కేసీఆరో కేటీఆరో నిలదీయడానికి వీలుపడదు. ఎందుకంటే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కేసీఆర్‌ని మాజీ సీఎం వచ్చి కలవలేదా? రాష్ట్ర అవసరాలకోసం ఢిల్లీకెళ్లి బీజేపీ ప్రధానిని రేవంత్‌రెడ్డి కలిసి రాలేదా? అందుకే లేనిపోని ఊహాగానాలు వద్దంటున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా. కేసీఆర్‌తోనే ఉంటామని చెబుతున్నారు. వాళ్లేం చెప్పినా, బీఆర్‌ఎస్ కాస్త అనుమానిస్తున్నా ఇలాంటి షాకింగ్ సీన్స్ మరిన్ని కనిపించబోతున్నాయి. నలుగురు కాదు మొత్తం 26మంది వెళ్లిపోతారంటూ బీజేపీ నేత రఘునందన్‌రావు బాంబుపేల్చారు. వెళ్తారో లేదోగానీ గెలిచిన కాంగ్రెస్ గెలుపు గెలుపే కాదన్నట్లు మాట్లాడుతున్న కేటీఆర్‌కైతే ఇది మింగుడుపడని పరిణామమే.