మెత్తగుంటే మొత్తబుద్ధవుతుంది. అదే అవతల చేయిలేపేలోపే చెంప ఛెళ్లుమనిపిస్తే అది వేరేలా ఉంటుంది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు ఇప్పుడిదే పన్లో ఉంది. బొటాబొటి సీట్లతో అధికారంలోకొచ్చారని బీఆర్‌ఎస్ దెప్పిపొడుస్తోంది. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదని గులాబీగ్యాంగ్ హెచ్చరికలు చేస్తోంది. కమలంపార్టీ మరో అడుగు ముందుకేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చంటోంది. అందుకే రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. గోటితో పోతుందని తేలిగ్గా తీసుకోకుండా గొడ్డలి బయటికి తీస్తోంది.
మొన్న మల్లారెడ్డి ఇప్పుడు మహిపాల్‌రెడ్డి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వన్‌బైవన్ షాక్ తగులుతోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనింగ్ శాఖ ఫిర్యాదుతో ఇల్లీగల్ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద ఎమ్మెల్యే సోదరుడిపై కేసు నమోదు చేశారు. తమ్ముడి అరెస్ట్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కన్నీటిపర్యంతం అయ్యారు. 2011లోనే లక్డారం క్వారీకి అనుమతులు తీసుకున్నామంటున్నారు మహిపాల్ రెడ్డి. కానీ అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నది అధికారుల వాదన. ఆధారాలు పక్కగా చూసుకున్నాకే ఎమ్మెల్యే సోదరుడిని లోపలేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాల భవనాలను ఈమధ్యే అధికారులు కూల్చేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్‌లోని చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో నిర్మించిన ఏరోనాటికల్, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలల భవనాలను కూల్చివేశారు. కొన్నాళ్లక్రితం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక కక్ష సాధింపు ఉందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మాది ప్రజాపాలన. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ఉండబోదని ఎన్నికల కంటే ముందే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
మొత్తానికి.. ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలు, మైనింగ్‌ను.. రేవంత్ సర్కార్ టార్గెట్ చేయడం.. తెలంగాణలో రాజకీయ కాక రేపుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు సీఎం ఇంటికి క్యూ కడుతున్నారు. తాజాగా ఆ లిస్టులోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరిపోయారు. బీఆర్‌ఎస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరూ ఆగేలా లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగైదు సీట్లన్నా గెలవకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు..బీఆర్‌ఎస్‌ని నిలబెట్టడం ఎవరి వల్లా కాదన్నదే ఇప్పుడు లేటెస్ట్ టాక్!