దేశానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు. కానీ దేశం ఎదగాలంటే ప్రపంచపటంలో నిలవాలంటే నగరాలే వెన్నెముకలు. అందుకే గ్రోత్ హబ్స్ పేరుతో నగరాల అభివృద్ధిపై కేంద్రం దృష్టిపెట్టింది. నీతి ఆయోగ్ రూపొందించిన గ్రోత్ హబ్స్ జాబితాలో చేరిపోయింది సాగరనగరి విశాఖపట్టణం. దేశంలోని నాలుగు నగరాలను గ్రోత్ హబ్స్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయిస్తే.. దక్షిణాది నుంచి విశాఖపట్టణం ఒక్కటే ఎంపికైంది. భారీగా నిధులిచ్చి విశాఖ నగరాన్ని కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది.
విజయదశమి నుంచి విశాఖనుంచే పాలనకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌లో నిర్ణయం జరిగిపోయింది. సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణం తుదిదశకు చేరిన సమయంలోనే గ్రోత్ హబ్స్‌లో విశాఖకు చోటు దక్కటం శుభసంకేతంగా భావిస్తున్నారు. దేశంలోని 20 నగరాలను పటిష్టమైన ఆర్థిక ఎదుగుదలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో నీతిఆయోగ్ ఉంది. ఆ నగరాలు ఆర్థిక ఎదుగుదల సాధించేలా పటిష్టమైన ప్రణాళికలు రచిస్తారు.
ప్రస్తుతానికి గ్రోత్ హబ్స్ పైలట్ ప్రాజెక్టులుగా ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖ నగరాన్ని నీతిఆయోగ ఎంచుకుంది. దక్షిణభారతదేశంలో ఒకే ఒక్క నగరం ఎంపికైతే అది విశాఖపట్టణమే కావడం విశేషం. మరోవైపు విశాఖ కేంద్రంగా వీలైనంత త్వరగా పాలన సాగించే ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దసరాకల్లా విశాఖను రాజధాని నగరంగా మార్చాలన్న సంకల్పంతో పనులు వేగం పుంజుకున్నాయి. విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరగాలని నిర్ణయం తీసుకున్న సమయంలోనే గ్రోత్ హబ్ జాబితాలో కూడా చోటు దక్కటంతో ఇప్పుడు అందరి దృష్టీ విశాఖవైపే.
జమిలి ఎన్నికల ప్రస్తావన లేదు… మహిళా రిజర్వేషన్ కూడా ఇప్పట్లో అమలయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలంగాణలో ఎన్నికలు సమయానికే జరుగుతాయన్న సంకేతాలతో పార్టీలన్నీ సమరానికి సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలకు పదును పెడుతున్నాయి పార్టీలు. ఇప్పటికే CWC సమావేశానికి వచ్చిన సోనియాగాంధీ.. పార్టీ తరపున ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించారు. సంక్షేమంలో తమకు తిరుగులేదంటోంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ కూడా జనాకర్షణ పథకాలతో వచ్చేస్తోంది.