బజార్లలో బిగ్‌బాస్‌ షో చూపిస్తే ఎలా?

pallaviprasanth-arrest.jpg

బిగ్‌ బాస్‌ హౌస్‌లోనే కాదు బయట కూడా బిగ్‌ డ్రామా నడిచింది. అభిమానుల అత్యుత్సాహం టైటిల్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ని జైలుపాలు చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన ఘర్షణలు, విధ్వంసం అతని మెడకు చుట్టుకుంది. ఏ1గా పల్లవి ప్రశాంత్‌ని ఏ2గా అతని తమ్ముడు రవిరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ చట్టపరిధిలో నడుచుకునేవారికేనని కొత్త సీపీ శ్రీనివాస్‌రెడ్డి ముందే చెప్పారు. రోడ్డెక్కి న్యూసెన్స్‌ చేస్తే సెలబ్రిటీలైనా, బిగ్‌బాస్‌ విన్నర్‌ అయినా మినహాయింపు ఉండదని ఈ అరెస్ట్‌తో తేల్చేశారు.

బిగ్‌ బాస్‌ హౌస్‌ అంటేనే బిగ్ డ్రామా. సీజన్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ రైతుబిడ్డగా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టి అనూహ్యంగా టైటిల్‌ సాధించాడు. బిగ్ బాస్ ఫైనల్స్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కంటెస్టెంట్స్‌ బయటికి వచ్చిన సమయంలో అభిమానులు రెచ్చిపోయారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను ధ్వంసం చేశారు. ఘటన సమయంలో రాళ్లదాడి జరుగుతుండటంతో అక్కడినుంచి ప్రశాంత్‌ని వెళ్ళిపోవాలని పోలీసులు కోరారు. అయినా అతను వినకపోవడంతోనే కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

అయితే తనమీద కొందరు కావాలనే దుష్ప్రచారంచేస్తున్నారని పల్లవి ప్రశాంత్‌ చెబుతున్నాడు. ఆ నలుగురితోనే తనకు థ్రెట్‌ ఉందంటున్నాడు. తాను ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడంతో కొందరు తనను ఇలా బద్నాం చేస్తున్నారని బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఆరోపిస్తున్నాడు. మరోవైపు బిగ్ బాస్ షో పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు అందింది. ఈ షో పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని హెచ్చార్సీకి హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదుచేశారు. మరోవైపు మొదట్నించీ బిగ్‌బాస్‌ షోపై ఫైర్‌ అవుతున్న సీపీఐ సీనియర్‌ నేత నారాయణ కూడా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిజమే.. షో నడిపించి స్టూడియో గేట్లనుంచి కంటెస్టెంట్లను బయటికి పంపిస్తే సరిపోతుందా? నాగార్జున నైతికబాధ్యత వహించాల్సిన పన్లేదా?

Share this post

submit to reddit
scroll to top