నరాలు తెగుతున్నాయ్‌ ఆ ఇద్దరికీ!

chandrababu-pawan.jpg

చేతిలో చెయ్యేసి పలకరించుకున్నంత సులువు కాదు పొత్తులో సీట్ల సర్దుబాటు. టీడీపీ-జనసేన కాంబినేషన్‌ అదుర్స్‌ అని రెండు పార్టీలు అనుకున్నా సీట్ల వ్యవహారం ముందుకెళ్లడంలేదు. దీంతో నేతల్లో అసహనం మొదలైంది. జనసేన గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటుందన్న చర్చ జరుగుతున్నా.. ఆ ఫిగర్‌ ఎంతన్నదే జవాబులేని ప్రశ్న. మొదట్లో జనసేనకు ఇరవై, పాతిక సీట్లు ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయిందని టాక్ నడిచింది. పార్టీశ్రేణులు టెన్షన్‌ పడేసరికి పవన్‌కల్యాణ్‌ కూడా గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జనసేన మద్దతు కీలకం కావటంతో ఆ పార్టీకి 40 నుంచి 60 సీట్లు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సీట్లిచ్చే పరిస్థితి లేదన్నది అంతర్గతంగా నడుస్తున్న చర్చ.

నెంబర్‌తో పెద్దగా పట్టింపులేకుండా గ్యారంటీగా గెలిచే సీట్లనే అడగాలనుకుంటోంది జనసేన. కానీ ఆ పార్టీ గన్‌షాట్‌గా గెలుస్తామనుకుంటున్న సీట్లనే టీడీపీ కూడా అడుగుతోంది. దీంతో రెండుపార్టీల పొత్తు చర్చల్లో అడుగు ముందుకు పడటంలేదు. ఓవైపు వైసీపీ అధినేత అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అసంతృప్తులు పెరిగినా మొండిగా ముందుకెళ్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో జగన్‌ స్పీడ్‌ చూసి విపక్షపార్టీలకు టెన్షన్‌ పెరుగుతోంది. ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు అయిపోగానే ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలా ఉంది. సంక్రాంతికే ఫస్ట్‌ లిస్ట్ వస్తుందని వార్తలొచ్చినా ఇంకా అడుగు ముందుకు పడలేదు. కొన్నిచోట్ల త్యాగాలు చేయాల్సి రావొచ్చని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు చెబుతున్నా.. ఆ సీట్లు పదుల సంఖ్యలో ఉండటం అధినేతలకు అగ్నిపరీక్షగా ఉంది.

పవన్‌కల్యాణ్‌ తర్వాత జనసేనలో కీలకంగా కనిపించే నాదెండ్ల మనోహర్‌ సీటు విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదు. తిరుపతిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు-పవన్‌ మధ్య పొత్తు ఖరారైనా సీట్ల విషయం తేలకపోవటంతో ముద్రగడ పద్మనాభంలాంటి నేతల చేరిక కూడా ఊగిసలాటలోనే ఉంది. ఎన్ని సీట్లు ఇస్తారో క్లారిటీ లేనప్పుడు, గెలిచిన తరువాత ఎలాంటి పదవులు వస్తాయో చెప్పనప్పుడు పొత్తు దేనికి, పార్టీలో చేరడం దేనికని ముద్రగడ ప్రశ్నించినట్టు ఓ ప్రచారమైతే జరుగుతోంది.

2019లో టీడీపీ గెలిచింది 23 సీట్లే అయినా ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బలం ఉంది. అదే సమయంలో చాలా నియోజకవర్గాల్లో జనసేన 10వేల నుంచి 30వేలదాకా ఓట్లు తెచ్చుకుంది. అందుకే రెండుపార్టీలు కలిసి పోటీచేస్తే అధికారంలోకొస్తామన్న ధీమాతో టీడీపీ ఉంది. కానీ సీట్ల సర్దుబాటు ఎలాగన్నదే చిక్కుప్రశ్నలా మిగిలింది. బలవంతంగా రుద్దితే ఓటు బదిలీ జరగదు. అప్పుడు పొత్తున్నా ప్రయోజనం ఉండదు. అందుకే అంత తర్జనభర్జన పడుతున్నారు చంద్రబాబు-పవన్. పడుతూనే పుణ్యకాలం గడిపేస్తారా.. దాన్నుంచి బయటపడతారా అన్నదే అసలు పాయింట్‌!

 

Share this post

submit to reddit
scroll to top