అన్యాయం అక్రమం అని కేసీఆర్ పార్టీ గొంతుచించుకున్నా ఫలితం లేదు. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని నీతివాక్యాలు వల్లించినా లాభం ఉండదు. ఎందుకంటే పదేళ్లపాలనలో గులాబీపార్టీ నేర్పించిన విద్యే అది. తెలంగాణలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు, బీఆర్‌ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. వీహెచ్‌లాంటి నేతలు వద్దంటున్నా నాలుగుకాలాలపాటు సీఎంగా ఉండాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి ఆగేలా లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్. అందుకే జీహెచ్‌ఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన్ని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. బల్దియాలో బలం పెంచుకుంటూ వచ్చిన కాంగ్రెస్ గ్రేటర్ పీఠంపై కన్నేసింది.
గ్రేటర్ పరిధిలో అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటిదాకా అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేదు. దాంతో మేయర్‌నే పార్టీలో చేర్చుకుంటే జీహెచ్‌ఎంసీపై మేయర్ పీఠాన్ని దక్కించుకోవచన్నది కాంగ్రెస్ ఆలోచన. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలు గెలిచాయి, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. బల్దియాలో బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ విషయంలో మజ్లిస్ పార్టీ స్టాండ్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కింగ్ మేకర్‌గా ఉన్న ఎంఐఎం సహకరిస్తే మేయర్ సీటు దక్కించుకోవడం కాంగ్రెస్‌కి పెద్ద కష్టమేమీ కాదు.