కొమ్ములేం లేవు.. ఖ‌ద్ద‌రు బాబులూ కేర్‌ఫుల్‌!

Supreme_Court_05_09_Delhi_2.jpg

ఎమ్మెల్యేలం.. ఎంపీలం. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌నం అడిగిందే ప్ర‌శ్న‌. మ‌న‌ల్నెవ‌రు ప్ర‌శ్నించేది అనుకుంటే పొర‌పాటే. లంచం తీసుకున్నవారు ఎవరైనా లంచగొండుల కిందే లెక్క. ఖ‌ద్ద‌రేశార‌ని స్పెషల్ ట్రీట్‌మెంట్ అంటూ ఏమీ ఉండదు. అభియోగాలొస్తే బోను ఎక్కాల్సిందే.. నేరం రుజువైతే ఊచలు లెక్కబెట్టాల్సిందే. చట్ట సభల్లో ఘ‌న‌త వ‌హించిన రాజ‌కీయ‌నాయ‌కుల‌కు చాచి చెంప‌మీద కొట్టిన‌ట్లు అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. చట్టసభలను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడినా విచారణని ఎదుర్కోవాల్సిందే.. ప్రజాప్రతినిధులమన్న మినహాయింపు ఏమీ ఉండదని సభ్యులకుండే చ‌ట్ట‌ర‌క్ష‌ణ‌ని తొలగిస్తూ సుప్రీంకోర్టు చ‌రిత్రాత్మ‌క తీర్పు చెప్పింది. గతంలో జేఎంఎం ముడుపుల కేసు సందర్భంలో ఇచ్చిన తీర్పుని సవరించి సరికొత్త తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం.

అసెంబ్లీల్లోనూ, పార్లమెంటులోనూ సభ్యులు ప్రశ్నలడగడం కోసమైనా, ఓటు వేయడానికైనా కక్కుర్తి పడి డబ్బు తీసుకుంటే ఎలాంటి మిన‌హాయింపులూ ఉండ‌వు. ఎవ‌ర‌యినా విచారణని ఎదుర్కోవాల్సిందే. ఈ తీర్పు వెనుక న్యాయపరంగా పెద్ద కసరత్తే జరిగింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతాసోరెన్‌ లంచం తీసుకుని ఓటు వేశారనేది అభియోగం. సీబీఐ అప్ప‌ట్లో ఆమెపై క్రిమినల్ కేసు న‌మోదుచేసింది. కేసును కొట్టివేయాలని జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు సీతాసోరెన్‌. అయితే హైకోర్టు ఆమె అభ్య‌ర్థ‌న‌ని తిరస్కరించడంతో సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

ఏడేళ్ల తర్వాత 2019లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిష‌న్‌పై విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడ్డార‌నే అభియోగాల‌ను కోర్టులు ప్రశ్నించవచ్చా అనే ధర్మసందేహంతో ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అవినీతి విషయంలో ఎంపీలకు రాజ్యాంగ రక్షణ ఉంటుందన్న 1998 నాటి పీవీ నరసింహారావు ముడుపుల కేసుని స్టడీ చేసింది. దీన్ని తిరగదోడాలంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బాధ్యతనిచ్చారు జస్టిస్‌ డీవై చంద్రచూడ్. లంచం తీసుకోవడం అనే ఆరోపణ చాలా తీవ్రమైనదని, ప్రజాజీవితంలో విశ్వసనీయతను ప్రశ్నిస్తుందని చెబుతూ 26 ఏళ్ల కిందటి తీర్పును తప్పుబడుతూ తాజా తీర్పునిచ్చింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం.

1993 జులైలో పీవీ నరసింహారావు ప్రభుత్వం విశ్వాసం నెగ్గాలంటే 251 ఓట్లు సాధించాల్సి ఉంది. ఇందుకోసం నలుగురు జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎంపీల ఓట్లను లంచమిచ్చి కొనుక్కున్నారన్న అభియోగంతో సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ చట్టసభ లోపల డబ్బులు తీసుకుంటే విచారణ పరిధిలోకి రాదంటూ 1998లో అప్పటి ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారంతా బైటపడ్డారు. అయితే అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన భాష్యంతో తాజాగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం విభేదించింది. లంచం తీసుకుంటే, విచారణ ఎదుర్కోకుండా చట్టపరమైన రక్షణ ఉండదని సుప్రీం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.

సభల్లో బిల్లులు ఆమోదించే సందర్భంలో, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు, ప్రభుత్వాల్ని కూలదోసే ప్రక్రియలప్పుడు సభ్యుల ఓట్లు చాలా కీలకం. ఒక్క ఓటుతో ప్రభుత్వాల తలరాతలు మారిపోతాయి. అందుకే సభ్యుల ఓట్ల‌కు కోట్లు ప‌లుకుతుంటాయి. నోటు తీసుకుని ఓటు అమ్ముకోవడం అనైతికం అని తెలిసినా అడిగేవారు ఎవ‌ర‌న్న‌ట్లు ప్ర‌జాప్ర‌తినిధులు అడ్డ‌దారులు తొక్క‌డం మామూలే. కానీ ఇకపై ఇలా లంచం తీసుకుని సభల్లో ప్ర‌శ్న‌లు అడిగినా, ఓటుహక్కు వినియోగించుకున్నా బోనెక్కి తీరాల్సిందే. ఇటీవలే పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది.

గతంలో సభ లోపల జరిగే కార్యకలాపాలపై జోక్యం చేసుకునే విషయంలో కోర్టులకు కొన్ని పరిమితులుండేవి. ఇది పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉండే వ్యవహారమని, న్యాయస్థానాల ప్రమేయం ఉండబోదని సభ్యులు తప్పించుకునేవారు. ఇక నుంచి అలా తప్పించుకునే వెసులుబాటు లేదు. అవినీతికి పాల్పడితే వారు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేన‌ని చ‌రిత్రాత్మ‌క‌తీర్పు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. లంచం తీసుకున్నా నేరమే. లంచం ఆశ చూపినా నేరమే. మూడోకంటికి తెలీద‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌ను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్ప‌డితే ఎవ‌రికైనా చ‌ట్టం ఒక‌టేన‌న్న‌ది సుప్రీంతీర్పు సారాంశం. ఈ దెబ్బ‌తో డబ్బులిచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు కొనుగోలు చేసే దుస్సంప్రదాయానికి చ‌ర‌మ‌గీతం పాడాల్సిందే. కక్కుర్తి పడి ఓటుకు నోటు తీసుకుంటే వేటుకు సిద్ధంగా ఉండాల్సిందే!

 

Share this post

submit to reddit
scroll to top