బాంబులు పెట్టి ఫేస్‌బుక్‌ లైవ్‌!

dominic-claimed-for-kerala-blasts.jpg

కేరళలోని జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బాంబులు పెట్టింది తానేనంటూ పోలీసులకు లొంగిపోయిన డొమినిక్‌ మార్టిన్‌ అంతకుముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడాడు. బాంబుపేలుళ్లకు పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకున్నాడు. ఫ్రంటల్‌ఫోర్స్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాంబు పేలుళ్లకు ఎందుకు పాల్పడ్డాడో ఫేస్‌బుక్‌ వీడియోలో డొమినిక్‌ మార్టిన్‌ వెల్లడించాడు. జెహోవా విట్‌నెస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. అది మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అందుకే బాంబుపెట్టానని చెప్పాడు.

ఫేస్‌బుక్‌ లైవ్‌లో అతను ఏమన్నాడంటే..
‘‘నా పేరు మార్టిన్‌. జెహోవా విట్‌నెస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్‌లో బాంబు అమర్చింది నేనే. అక్కడ జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరేళ్ల క్రితమే నేను గుర్తించాను. పద్దతి మార్చుకోవాలని ఎన్నోసార్లు చెప్పినా వాళ్లు వినలేదు. అలాంటి సంస్థ మన దేశానికి అవసరం లేదు. అందుకే బాంబులు అమర్చాను. ఇది చాలా విధ్వంసం సృష్టిస్తుందని నాకు తెలుసు. దీనిమీద ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు. బాంబు పేలుళ్లను ఎలా ప్లాన్‌ చేశానన్నది చెప్పడం చాలా ప్రమాదకరం. అందుకే నేను చెప్పడం లేదు’’


బాంబు పేలుళ్లకు బాధ్యుడినని లొంగిపోయిన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. బాంబు పేలుళ్లతో అతడికి నిజంగానే సంబంధం ఉందా అన్నదానిపై ఇంకా నిర్ధారణకు రాలేదు. ఎన్‌ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. ఇది ఉగ్రదాడేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

Share this post

submit to reddit
scroll to top