ఎప్పుడిచ్చామన్నది కాదన్నయ్యా!

kachateevu.jpg

అనగనగా ఓ దీవి. మ్యాప్‌లో కనిపించీకనిపించనట్టు ఉండే ఆ చిన్న దీవిపై ఇప్పుడు వివాదం రాజుకుంది. పెద్ద దుమారం రేగుతోంది. ఎప్పుడో 1974లో ముగిసిందనుకున్న పంచాయితీ పార్లమెంటు ఎన్నికలకు ముందు మళ్లీ తెరపైకొచ్చింది. భారత్‌- శ్రీలంక మధ్య కచ్చతీవు ఐలాండ్‌ వివాదం మళ్లీ రాజుకుంది. కాదు కాదు అదనుచూసుకుని బీజేపీనే రాజేసింది.

భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని 1974లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ అంశంపై గతంలోనే ఒకసారి కాంగ్రెస్‌ను కార్నర్‌ చేసిన మోడీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పిదాలకు ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నామని మండిపడ్డారు. తమిళనాడులో ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా కచ్చతీవు అంశాన్ని తెరపైకి తెస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. శ్రీలంకకు కచ్చతీవు అప్పగింతని తమ పార్టీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోందని డీఎంకే చెబుతోంది.

కచ్చతీవు కేవలం ఎన్నికల ప్రచారం కోసం అకస్మాత్తుగా తెరమీదికొచ్చిన అంశం కాదంటున్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌. పార్లమెంటు, కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందన్నారు. కచ్చతీవు వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు తాను జవాబు ఇచ్చానని వెల్లడించారు. అప్పటి ప్రధానులు భారత భూభాగాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.1974 తరువాత తమిళనాడులో జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ కీలకాంశంగా మారుతోంది కచ్చతీవు. కానీ ఎన్నికల తర్వాత మరుగునపడుతోంది.

భారత్‌- శ్రీలంకను వేరుచేస్తున్న పాక్‌ జలసంధిలో ఉంది 285 ఎకరాల విస్తీర్ణంలోని కచ్చతీవు ఐలాండ్‌. తమిళనాడు నుంచి కేవలం 25కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ద్వీపం. స్వాతంత్య్రానికి పూర్వం రామ్‌నాడ్‌ పాలకుల ఆధీనంలో కచ్చతీవు ఉండేది. ప్రస్తుతం రామేశ్వరం సహా పలుదీవులపై రామ్‌నాడ్‌ జమీందారుల పాలన సాగేది. అనంతరం ఆ సంస్థానం తమిళనాడులో విలీనం అయింది. అయితే 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు.

వాస్తవానికి కచ్చతీవు చాలా చిన్నదీవి. అక్కడ ఎవరూ నివాసం ఉండరు. అయితే ఇక్కడి సెయింట్‌ ఆంటోనీ ప్రార్థనామందిరంలో ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. కచ్చతీవులో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. ఈ దీవిలో భారత్‌ మత్స్యకారులకు ఒప్పందం ప్రకారం ప్రవేశం ఉన్నా శ్రీలంక ఖాతరు చేయడం లేదు. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు దాడులకు దిగుతున్నాయి. పడవలను ధ్వంసం చేయడంతో పాటు మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం వంటి చర్యలకు దిగుతోంది శ్రీలంక ప్రభుత్వం.

భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా చేపట్టిన ఈ అప్పగింత న్యాయపరంగా చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు..రాజకీయ పార్టీలు. దీంతో ఈ కచ్చతీవు వివాదం మున్ముందు మరిన్ని పొలిటికల్‌ టర్న్‌లు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Share this post

submit to reddit
scroll to top