నీవు నేర్పిన విద్యయే కల్వకుంట్లా!

Pocharam-Srinivas-Reddy-e1719247653271.jpg

తెలంగాణలో మళ్లీ పొలిటికల్‌ షో మొదలైంది. ఫస్ట్‌ సీజన్‌లో చేరికలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కండువా కప్పి సెకండ్ సిరీస్‌ స్టార్ట్‌ చేశారు. మరో సిరీస్‌తో పన్లేకుండా ఈ సీజన్‌లోనే షో కంప్లీట్‌ చేయాలనుకుంటున్నారు రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో బీఆర్‌స్‌ని సింగిల్‌ డిజిట్‌కి పరిమితం చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక బీఆర్ఎస్‌ పార్టీకి సైలెంట్‌ షాక్. ఇలా జరుగుతుందని ఆ పార్టీ అధినాయకత్వం కల్లో కూడా ఊహించ లేదు.

పోచారం షాక్‌ నుంచి కోలుకోకముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ జెండా ఎత్తేశారు. కేసీఆర్‌ కుటుంబానికి నమ్మకస్తుడైన ఎమ్మెల్యే కూడా గోడ దూకేయటంతో.. ఎవరినీ నమ్మలేని పరిస్థితిలో ఉంది గులాబీపార్టీ. ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ జానారెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా కలవడం బీఆర్‌ఎస్‌కు మరో షాక్. త్వరలోనే కాంగ్రెస్‌లోకి 20మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు దానం నాగేందర్‌. బీఆర్‌ఎస్‌నుంచి అందరికంటే ముందు కాంగ్రెస్‌లోకి దూకేసింది ఆయనే. దీంతో దానం శకునంతో ఎమ్మెల్యేలందరినీ అనుమానంగానే చూస్తోంది బీఆర్‌ఎస్‌ నాయకత్వం.

గతంలో మెదక్‌జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దానికేదో ప్రొటోకాల్‌ సాకు చెప్పుకున్నారు. తర్వాత రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ఒకటికి రెండుసార్లు రేవంత్‌ని కలిసొచ్చారు. దానం లిస్ట్‌ ప్రకారం మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద్ గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేష్‌ కుమార్‌ గౌడ్ అయితే భవిష్యత్తులో బీఆర్ఎస్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌ తప్ప మరెవరూ మిగలరంటున్నారు.

రాజకీయ శత్రువులను సైతం పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటోంది కాంగ్రెస్. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డితో కలిసి పని చేసి ఆ తరువాత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కీలక శాఖలు చూసిన ఓ మాజీ మంత్రి చేరికను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే వ్యతిరేకించారని తెలిసింది. రాబోయే రోజుల్లో ఆ జిల్లాని క్వీన్‌స్వీప్‌ చేయాలంటే ఆ మాజీ మంత్రి అవసరమని అగ్రనాయకత్వం చెప్పటంతో రేవంత్‌ అయిష్టంగానే అంగీకరించినట్టు చెబుతున్నారు. ఆయన చేరితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలకు ఎవరికీ ఎలాంటి అడ్డంకులు లేనట్లే లెక్క. జగిత్యాల ఎమ్మెల్యే చేరికతో జీవన్‌రెడ్డి అలిగారు. ఆయన్ని బుజ్జగించేందుకు ముఖ్యనేతలంతా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బీఆర్‌ఎస్‌ని పూర్తిగా బలహీనపరచాలన్నదే కాంగ్రెస్‌ హైకమాండ్‌ టార్గెట్‌గా కనిపిస్తోంది.

అధికారపార్టీ అనుకున్నట్టు 25 మంది ఎమ్మెల్యేలు చేరితే.. సాంకేతికంగా బీఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనట్లే లెక్క. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రెండు జాతీయ పార్టీల నుంచి నేతల్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడుతోంది. గతంలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్‌కి రివర్స్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ క్లైమాక్స్‌ చివరికి ఎలా ఉండబోతోందో ఏమో!

Share this post

submit to reddit
scroll to top