ఏపీలో అసలేంటి ఈ ఓట్ల పంచాయితీ?

Ap-Voters.jpg

అదిగో పులి అంటే ఇదిగో తోకనడం రాజకీయాల్లో మామూలే. కానీ ఈవివాదం అలాంటి ఊహాజనితమేమీ కాదు. ఎందుకంటే నిజ నిర్ధారణకు ఆధారాలుంటాయి. ఖండనకైనా వివరణకైనా ఓ హేతుబద్ధత ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఓ పట్టాన తేలడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న ఏపీలో ఓట్ల పంచాయితీ ఎంతకీ తెమలడం లేదు. కొత్తగా ఓటర్లను చేర్పించారని, అవన్నీ దొంగ ఓట్లేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఉన్న ఓటర్లని తొలగిస్తున్నారని విపక్షపార్టీ మరో ఫిర్యాదు చేస్తోంది. వైసీపీ కూడా తమ ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ రెండుపార్టీల వాదనలో ఏది నిజం? ఏది అబద్ధం?

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘందాకా పంచాయితీ వెళ్లినా స్పష్టత మాత్రం లేదు. గతంలో 50 లక్షల ఓట్లు తొలగించిన చరిత్ర చంద్రబాబుదేనంటోంది వైసీపీ. సేవామిత్ర యాప్‌తో గతంలో ఓట్లు తొలగించారని, ఇప్పుడు మరో యాప్ తయారుచేయించి ఓటర్ల సమాచారాన్ని కాజేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ గవర్నర్‌ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాని సవరించి 30 లక్షల ఓట్లను మళ్లీ చేర్చింది. అదే విషయాన్ని సజ్జలలాంటి నేతలు గుర్తుచేస్తుంటే.. ఢిల్లీకి వెళ్లి మరీ ఈసీకి ఫిర్యాదులు చేస్తోంది ప్రతిపక్షపార్టీ.

రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు తప్పుడు ఓటర్ల జాబితా తయారుచేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వాలంటీర్‌ వ్యవస్థని అడ్డంపెట్టుకుని టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారన్నది టీడీపీ కంప్లైంట్. రెండేసి ఓట్లున్నవారి జాబితాని, మరణించిన ఓటర్ల జాబితాని ఇచ్చినా ఆ ఓట్లను తొలగించలేదంటోంది టీడీపీ. బీఎల్‌వోల వెంట వాలంటీర్లను పంపి విపక్షపార్టీల మద్దతుదారుల ఓటర్లను తొలగిస్తున్నారని టీడీపీ వాదిస్తోంది.

ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ వాదన ఎలా ఉన్నా అంతా న్యాయబద్ధంగానే జరుగుతోందని వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ 60 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించిందని.. వాటినే తాము తీయించేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. పదినెలలనుంచీ టీడీపీ, వైసీపీ మధ్య ఈ పంచాయితీ నడుస్తోంది. ఎవరి వాదన నిజమో ఏ మాటా చెప్పకుండా ఎన్నికల సంఘం తనపని తాను చేసుకుపోతోంది. ఓటు ఓటే. అది ఎవరికి అనుకూలమన్నది ఆ హక్కున్నవారి ఇష్టం. వీళ్లు మనకు అనుకూలమని చేర్పించడం, వాళ్లు మనకు వేయరని తీసివేయించడం రెండూ తప్పే. రాజకీయరగడలో తమ ఓటు చేజారకుండా ఎవరికివారు జాగ్రత్తపడటం తప్ప, గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరుకోవడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.

Share this post

submit to reddit
scroll to top