మేడిగడ్డ.. బీఆర్‌ఎస్‌ నెత్తిన మరో బండ!

kcr-at-medigadda-barraige-Old-File-Image.jpg

ఉద్యమపార్టీ. భావోద్వేగాలు రగిలించి అధికారంలోకొచ్చిన పార్టీ. ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు అధికారపీఠం ఎక్కినపార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. పార్టీ పేరులోనే ఇప్పుడా భావోద్వేగం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్‌ రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఉట్టికెక్కలేనమ్మ అన్న సామెతని గుర్తుకు తెచ్చేలా జాతీయస్థాయికి ఎదగాలన్న తాపత్రయంలో రాష్ట్రంలో పట్టుకోల్పోయింది. ఎంఐఎంతో దోస్తీ ఓ వైపు.. బీజేపీతో లోపాయికారీ అవగాహన ఉందనే ఆరోపణలు ఓవైపు. ఉద్యమకారులు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. మొన్నటిదాకా తోడున్న వర్గాలు ఒక్కోటీ దూరమవుతున్నాయి. దీంతో ఫ్రస్టేషన్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌కి ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి.

సర్వేలన్నీ మాకే అనుకూలమంటోంది బీఆర్‌ఎస్‌. కానీ కాంగ్రెస్‌ని చూసి ఉలిక్కిపడుతోంది. విద్యార్థులు, నిరుద్యోగులు రగిలిపోతున్నారు. సామాన్యులు కూడా రెండుసార్లు అవకాశం ఇచ్చాంకదా అని సణుక్కుంటున్నారు. ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్‌ ఇప్పుడు పనిచేయదు. అందుకే ఢిల్లీ బానిసత్వం మనకు అవసరమా అని బీఆర్‌ఎస్‌ అడుగుతోంది. బీఆర్‌ఎస్‌ ఎంత బలంగా వాదిస్తున్నా, ఎంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మొన్నటి ప్రవల్లిక ఆత్మహత్యోదంతంతోనే ఆ పార్టీ పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో ప్రజలకు అర్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూ బలవన్మరణానికి పాల్పడిందా యువతి. అసలామె గ్రూప్స్‌కి దరఖాస్తే చేయలేదన్న ప్రభుత్వ వాదన గాలిబుడగలా పేలిపోయింది. గ్రూప్‌ వన్‌ నుంచి గ్రూప్‌ ఫోర్‌దాకా అన్ని ప్రయత్నాలుచేసిన ప్రవల్లిక ఆత్మహత్యకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చుగాక. కానీ అసలామె దరఖాస్తే చేయలేదన్న అబద్ధపువాదన ప్రభుత్వ నైతికతని బోనులో నిలబెట్టింది.

మేం అధికారంలోకొచ్చాక తెలంగాణ రూపురేఖలే మారిపోయాయన్నది బీఆర్‌ఎస్‌ స్లోగన్‌. వలసలు ఆగిపోయాయని, పచ్చటి మాగాణం తెలంగాణని దేశంలోనే ఉన్నతంగా నిలబెట్టిందని ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుని గొప్పగా చూపిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవటంతో సమాధానాలు వెతుక్కునే పన్లో పడింది. ఇప్పుడా నిర్మాణలోపాన్ని విద్రోహచర్యగా చూపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బ్యారేజ్‌ కుంగుబాటు వెనుక ఎలాంటి కుట్రా లేదని చెప్పిన పోలీసులు ఫోరెన్సిక్‌, క్లూస్‌టీమ్స్‌ నివేదిక తర్వాతే ఓ నిర్ధారణకు వస్తామని వెంటనే మళ్లీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హడావుడిగా వచ్చిన కేంద్రబృందం ఉచిత సలహాలిచ్చి వెళ్లింది. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో లోపాలులేవంటూనే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందంటున్నారు ఈఎన్‌సీ. ఇసుక కొట్టుకుపోయి పునాది బలహీనపడి ఉండొచ్చని ఈఎన్‌సీ మురళీధరన్‌ తన ‘అనుభవం’తో విశ్లేషిస్తున్నారు.

మేడిగడ్డలో పది పిల్లర్లు మళ్లీ కట్టాల్సిందేనని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక అంచనాకొచ్చింది. 110శాతం పర్‌ఫెక్ట్‌గా చేసినా చిన్నాచితకా లోపాలు తప్పవని సెలవిస్తోంది ఘనత వహించిన అధికారయంత్రాంగం.  గతంలో ఇలాంటి లోపాలమీద అపారమైన విశ్లేషణలెన్నో చేసిన భారీ నీటిపారుదలశాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మొన్నటిదాకా కాంగ్రెస్‌తోనే ఉండేవారు. ఈమధ్యే టికెట్‌ రాలేదని అలిగి అధికారపార్టీలో చేరిపోయారు. అసలేం జరిగి ఉంటుందో పునాదుల లోతుల్లోకి వెళ్లి తవ్వితీసే మేథావులు బయటికి రావాలి. బ్యారేజ్‌ కట్టిన ఎల్‌అండ్‌టీ ఏమో ఆ నష్టమేదో మేమే భరించి పునరుద్ధరణ పనులు చేస్తామంటోంది. నిజంగా నిర్మాణ లోపాలున్నాయో లేదో నిలకడమీద తెలుస్తుంది. కానీ ఎన్నికలకు నెలరోజుల ముందు ఇవన్నీ బీఆర్‌ఎస్‌కి అపశకునాల్లాగే కనిపిస్తున్నాయి

Share this post

submit to reddit
scroll to top