నిస్సందేహంగా ఆయన భారతరత్నమే!

karpuri-thacore.png

1977నాటి సంఘటన అది. కర్పూరిఠాకూర్‌ బీహార్‌ సీఎంగా అప్పుడప్పుడే బాధ్యతలు చేపట్టారు. కేంద్రంతో పాటు బీహార్‌లో జనతా ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పుట్టినరోజు వేడుకల్లో కర్పూరిఠాకూర్‌ చిరిగిన కుర్తాతో కనిపించారు. ముఖ్యమంత్రి అయ్యుండీ సాదాసీదాగా ఒంటిమీదున్న బట్టలతో వచ్చేశారాయాన. దాంతో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఠాకూర్‌జీ కొత్త కుర్తా కోసం ప్రజలను విరాళం అడిగారు. అయితే వచ్చిన విరాళాన్నంతా ఠాకూర్‌ సీఎం సహాయ నిధికి ఇచ్చేశారు.

గంటగంటకీ కాస్ట్యూమ్స్‌ మార్చే ఘనతవహించిన నేతలున్న ఈ దేశంలో ఒకప్పుడు అంతటి నిరాడంబరులైన కర్పూరిఠాకూర్‌లాంటి వారు ఉండేవారని ఇప్పుడంతా గుర్తుచేసుకుంటున్నారు. ఎప్పుడో 1988లో కన్నుమూసిన అలాంటి మహనీయులను ఇప్పుడు స్మరించుకోవడానికి కారణం.. మరణానంతరం 35ఏళ్లకు ఈ దేశ అత్యున్నత పురస్కారం ఆయన్ని వరించడమే. బీహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించింది.

జన నాయక్‌గా పేరున్న బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ బ్రిటిష్ ఇండియాలోని బీహార్‌-ఒడిశా ప్రావిన్స్‌లోని పితౌజియాలో 1924 జనవరి 24న అతి సామాన్య కుటుంబంలో జన్మించారు. నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన విద్యార్థి దశలోనే పోరాట పంథాని ఎంచుకున్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 26 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. స్వాతంత్ర్యానంతరం ఉపాధ్యాయుడిగా సేవలందించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ తర్వాత జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి విధాన సభలో అడుగుపెట్టారు.

బీహార్‌ మంత్రిగా ఉన్న సమయంలో మెట్రిక్యులేషన్‌లో తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి ఆంగ్లాన్ని తొలగించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి కృషిచేశారు. తొలుత గాంధీజీ ఆలోచనల్ని ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత సైద్ధాంతికంగా బాపూజీతో విభేదించారు కర్పూరి ఠాకూర్‌. రామ్‌మనోహర్‌ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి చాలా కాలం పాటు అధ్యక్షుడిగా కొనసాగారు. జయప్రకాశ్‌ నారాయణ్‌కు సన్నిహితుడిగా ఉన్న ఠాకూర్‌ ఆ తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు.

అగ్రకులాల రాజకీయ ఆధిపత్యం ఉండే బీహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసింది ఆయనే. జేపీ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్ కుమార్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌ వంటి నేతలకు కర్పూరి ఠాకూర్‌ రాజకీయ గురువు. బీహార్‌ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన కర్పూరిఠాకూర్‌ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. అలాంటి మహనీయుడి సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నని ప్రకటించడం దేశానికే గర్వకారణం.

Share this post

submit to reddit
scroll to top