2029లోనే జమిలి.. లా కమిషన్‌ కొత్త ఫార్ములా!

jamili-elections.jpg

అన్ని ఎన్నికలు కలిపి పెట్టేస్తే కొంప కొల్లేరవుతుందని భయపడుతున్న పార్టీలు ప్రస్తుతానికి నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే 2024లో జమిలి ఎన్నికలు సాధ్యంకాదని లా కమిషన్‌ తేల్చేసింది. సరైన సన్నద్ధత లేకుండా ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ కష్టమేనని లా కమిషన్‌ సంకేతాలివ్వటంతో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఈసారి షెడ్యూల్‌ ప్రకారం విడివిడిగానే జరగబోతున్నాయి. జమిలి ఎన్నికలపై రూపొందించి కేంద్రానికి సమర్పించాల్సి ఉన్న రిపోర్ట్ ఇంకా ఖరారు కాలేదని ఇప్పటికే లా కమిషన్ వెల్లడించింది. అదరబదరా పూర్తిచేసే ప్రక్రియ కాదిది. ఎంతో అధ్యయనం చేయాలి. అందరి అభిప్రాయాలు సేకరించాలి. ఏమాత్రం తొందరపడ్డా నేలవిడిచి సాముచేసినట్లే. అందుకే అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని లా కమిషన్‌ స్పష్టంచేసింది.

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ప్యానెల్‌ని నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ ప్యానెల్‌ ఏం చర్చించిందన్నది ఇంకా తెలియరాలేదు. ఒకే దేశం-ఒకే ఎన్నికపై లా కమిషన్ సెప్టెంబర్ 27న సమావేశమైంది. ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయానికి లా కమిషన్‌ వచ్చింది. 2029 నుంచి జమిలి ఎన్నికలను అమలుపరిచేందుకు లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందించబోతోంది. 2029లో ఈ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల శాసనసభల గడువులను సర్దుబాటు చేసేలా లా కమిషన్‌ కొన్ని సూచనలు చేయబోతోంది. అంటే కొన్ని అసెంబ్లీల కాల వ్యవధి పొడిగించడం, మరి కొన్నిటికి తగ్గించడంవంటి సిఫార్సు ఉండొచ్చు.

తొలిదశలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు రెండోదశలో నిర్వహించాలని లాకమిషన్‌ సూచించే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండు దశలూ ఒకే ఏడాదిలో పూర్తిచేసేలా లా కమిషన్‌ సూచనలు ఉండొచ్చు. ప్రభుత్వం అందుకు సిద్ధమైతే మూడంచెల ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితా కోసం లా కమిషన్‌ విధి విధానాలు రూపొందిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వేర్వేరు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాల్సి వస్తోంది. ఉపయోగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నాయి. అన్ని ఎన్నిలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉంటే అవవసర వ్యయంతో పాటు మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతుందని లా కమిషన్‌ అభిప్రాయపడుతోంది. జమిలి ఎన్నికల ప్రక్రియతో ఓటర్లు పదేపదే క్యూలో నిలుచోవాల్సిన అవసరం ఉండదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఒక్కసారే పోలింగ్‌ బూత్‌కు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని లా కమిషన్‌ సూచిస్తోంది.

Share this post

submit to reddit
scroll to top