ఎవరినైనా మేనేజ్‌చేయగలరు. ఒకప్పుడు చంద్రబాబు మీదున్నముద్ర ఇది. రాజకీయంగా ఎవరిని ఎలాగైనా మేనేజ్ చేయొచ్చేమో.. న్యాయవ్యవస్థతో అది అస్సలు కుదరదు. ఒక్కోసారి అన్నీ అనుకూలంగా ఉంటే తీర్పు అనుకూలంగా రావచ్చేమో. కానీ ప్రతీసారీ అది సాధ్యంకాదు. 17A కవచాన్ని అడ్డుపెట్టుకుని కేసునుంచి బయటపడాలనుకున్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును క్వాష్ చేయించుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆయనొకటి తలిస్తే అత్యున్నత న్యాయస్థానం స్పందన మరోలా ఉంది.
చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆయనకు మినహాయింపు ఉంటుందా లేదా అన్నదానిపై సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. అవినీతి నిరోధక చట్టంలోని 17A సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో భిన్నాభిప్రాయాలు వెలువరించింది సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్. తదుపరి కార్యాచరణని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదించింది. సుప్రీంలో అనుకూలంగా తీర్పు ఇస్తే రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల కదనరంగంలోకి దూకాలనుకున్నారు చంద్రబాబు. బట్ తీర్పుపై ప్రతిష్ఠంభనతో త్రిసభ్య ధర్మాసనమో, సీజేఐ నేతృత్వంలో విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాల్సి ఉంది.
దాదాపు 50రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో గడిపారు చంద్రబాబునాయుడు. ఓ దశలో ఎన్నికల్లోపు ఆయన బయటికొస్తారో లేదోనని పార్టీవర్గాలే ఆందోళనకు గురయ్యాయి. ఏదయితేనేం బెయిలొచ్చింది. ప్రస్తుతం బెయిల్ మీద బయటున్నారు టీడీపీ అధినేత. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అరెస్ట్‌చేయకుండా ప్రస్తుతానికి చంద్రబాబు న్యాయస్థాన రక్షణలో ఉన్నట్లే. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై క్లారిటీ ఇవ్వడానికి ఎంత లేదన్నా మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఈలోపు ఎన్నికలొస్తాయి. ఫలితాలొచ్చాకే రాజెవరో రెడ్డెవరో తెలుస్తుంది. సో.. ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ప్రతిపక్ష నేతకు అరెస్ట్ ప్రమాదం లేనట్లే లెక్క!
చంద్రబాబును మళ్లీ జైల్లో వేయాలంటే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నట్టు ఆధారాలు చూపించో, లేదంటే మరో కేసులోనో ఆ పనిచేయాల్సి ఉంటుంది. కానీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుతో సొంతపార్టీలోనే కొంత అసంతృప్తి ఎదుర్కుంటున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలముందు ఆ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు మీద సింపథీ వచ్చిందంటే అసలుకే మోసమొస్తుంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీద అవినీతి అభియోగాలు మోపి నెలన్నరకు పైనే జైల్లో ఉంచానన్న సంతృప్తి ఆయనకు ఉంది. అందుకే సార్వత్రిక ఎన్నికల్లోపు మళ్లీ చంద్రబాబు కేసుని వైసీపీ ప్రభుత్వం కెలికే ప్రయత్నం చేయకపోవచ్చు.
ఏపీ తరహా రాజకీయమే తెలంగాణలో తెరపైకొచ్చేలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చీరాగానే కేసీఆర్ పార్టీ దాడి మొదలుపెట్టింది. కేసీఆర్ ఇంకా నోరిప్పలేదుగానీ కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కారుపై అప్పుడే అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అధికారంలో కంటే కేసీఆర్ విపక్షంలో ఉంటేనే ఎక్కువ ప్రమాదమంటూ ఆయన తనయుడు చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ కూడా తేలిగ్గా ఏమీ తీసుకోవడంలేదు. కేసీయార్‌కి కోలుకునే అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడని కాంగ్రెస్ నాయకత్వానికి తెలుసు. అందుకే పాతవన్నీ తవ్వడం మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్ సర్కారు. కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతూ హైకోర్టుకు లేఖ రాసింది. గొర్రెల పథకంలో అక్రమాలను తిరగదోడే ప్రయత్నాల్లో ఉంది.
కేసీఆర్‌ని పక్కాగా కేసుల్లో ఇరికించాలంటే రేవంత్‌రెడ్డి అన్నీ వ్యూహాత్మకంగానే చేసే అవకాశం ఉంది. గవర్నర్ ముందస్తు అనుమతి అవసరం అనుకుంటే ఆ విషయంలో కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రాజ్‌భవన్ సానుకూలంగానే స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే తనను ఎంతగానో అవమానించిన కేసీఆర్‌పై తమిళిసై పీకల్లోతు కోపంతో ఉంటారు. అయితే కేంద్ర నాయకత్వం అనుమతిలేకుండా గవర్నర్ ముందడుగు వేసే అవకాశం కూడా ఉండదు. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో మళ్లీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ విషయంలో బీజేపీనాయకత్వం స్టాండ్ మారిందని అనుకోవడానికి లేదు.
బీఆర్ఎస్‌మీద ప్రత్యేక ప్రేమేమీ లేదని చెప్పేందుకు కవితపై కొరడా ఝుళిపించినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. అయితే బీఆర్ఎస్ బలహీనపడితే కాంగ్రెస్ బలపడుతుంది. అది బీజేపీ నాయకత్వానికి అస్సలు ఇష్టంలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎంల విషయంలో కేంద్రంలోని బీజేపీ ఒకే విధంగా స్పందించే అవకాశాలు లేవు. ఎప్పటికి ఏది ఎంతవరకు అవసరమో అదే చేస్తుంది బీజేపీ. అందుకే ఏంచేస్తారు ఎలా చేస్తారన్నది జరిగాక మాట్లాడుకోవడమే తప్ప ఈ పరిస్థితుల్లో ఊహకు అందడం కష్టమే!