కోహ్లీ క్రీజ్‌లో ఉంటే విధ్వంసమే!

kohli1-1.jpg

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. మొదట్లో క్రీజులో కుదుర్కునేందుకు కొంత సమయం తీసుకున్నా తర్వాత చెలరేగి ఆడాడు కోహ్లి. పరుగుల సునామీతో కివీస్ బౌలర్లకు చెమట పట్టించాడు. విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ని స్టేడియంలో ప్రత్యక్షంగా చూసిన అతని సతీమణి అనుష్కశర్మ ప్రతీ షాట్‌నీ ఎంజాయ్‌ చేసింది. కోహ్లి 50 సెంచరీల రికార్డ్‌ని అందుకోగానే ఫ్లయింగ్‌ కిస్‌లతో కోహ్లిని ప్రశంసించింది.

ఈ వరల్డ్‌ కప్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి తన వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ పూర్తిచేసి సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును చెరిపేశాడు. కేవలం 292 మ్యాచ్‌ల్లోనే కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. కివీస్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117 పరుగులు సాధించాడు. సచిన్‌ రికార్డుని అధిగమించడమే కాదు.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డ్‌ని కూడా కోహ్లీ తిరగరాశాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు నమోదు చేస్తే.. ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 709 పరుగులు చేసి టాప్‌ స్కోరర్స్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌కి చేరుకున్నాడు.

వన్డేల్లో 50 సెంచరీలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్‌ది సెకండ్‌ ప్లేస్‌. ఇక 31 సెంచరీలతో భారత క్రికెటర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ (30), శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య (28) 4, 5 స్థానాల్లో నిలిచారు.

సౌతాఫ్రికా ప్లేయర్స్‌ హషీమ్ ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (25), శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర (25), ఆసీస్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్ (22) వరుసగా తర్వాతి అయిదు స్థానాల్లో ఉన్నారు. వీళ్లందరిలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌ తప్ప మిగిలినవారంతా రిటైర్మెంట్ ప్రకటించారు. కోహ్లి తర్వాత ఆటగాళ్లు చాలా సెంచరీల దూరంలో ఉండటంతో అతని రికార్డు బద్దలయ్యే అవకాశం కనుచూపు మేరలో లేనట్లే!.

Share this post

submit to reddit
scroll to top