గాజా ఓ మయసభ!

Gaza-Tunnel-e1730640897716.jpg

మయసభ తెలుసుగా. ఏమీ లేకున్నా ఏదో ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. నీళ్లున్న చోట కూడా నేల చదునుగా ఉన్నట్లు అనిపిస్తుంది. హమాస్‌ ఉగ్రవాద సంస్థకు బంకర్‌లా ఉన్న గాజా నగరం కూడా అంతే. ఎందుకంటే పైకి కనిపించే కట్టడాలే నగరం కాదు. ఎన్ని నేలమాళిగలుంటాయో.. అవి ఎంత విస్తరించి ఉంటాయో ఎక్కడ మొదలై ఎక్కడ అంతం అవుతాయో ఎవరికీ తెలీదు. ఆకాశంనుంచి నిఘానేత్రాల కంట పడకుండా ఉండేందుకు, ఎయిర్‌ స్ట్రయిక్స్‌ జరిగినా ముప్పు కలగకుండా కాపాడుకునేందుకు హమాస్‌ టెర్రరిస్టులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకే కిడ్నాప్‌కి గురైన ఇజ్రాయిల్‌, విదేశీ బందీలను కాపాడుకోవడం ఇజ్రాయిల్‌కి ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది.

హమాస్‌ ఉగ్రవాదులు ఎవరినైనా కిడ్నాప్‌ చేసి గాజాకి తరలిస్తే వారిని గుర్తించడం దాదాపు అసాధ్యం. ఇజ్రాయిల్‌పై మెరుపుదాడి తర్వాత పదులసంఖ్యలో ప్రజలను బందీలుగా చేసుకుని పట్టుకువెళ్లారు హమాస్‌ ఉగ్రవాదుల, ఇజ్రాయిల్‌ బలగాలు అప్రమత్తమయ్యేలోపు బందీలతో తమ సురక్షిత స్థావరాలకు చేరుకున్నారు. వారిని ఉగ్రవాదులు గాజాలోని టన్నెల్స్‌లో బంధించారని భావిస్తున్నారు. గాజాలో టన్నెల్‌ నెట్‌వర్క్‌ అత్యంత దుర్భేద్యంగా ఉంటుంది. అందుకే వారిని సురక్షితంగా కాపాడుకోవడం ఇజ్రాయిల్‌కి అంత సులువేం కాదు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకే హమాస్‌ సామాన్య పౌరులను రక్షణ కవచాలుగా మార్చుకుంది. ఎందుకంటే ఇజ్రాయిల్‌ తమ పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఆ సెంటిమెంట్‌నే హమాస్‌ తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది.

పదిహేడేళ్లు వెనక్కి వెళ్తే 2006 ఓ ఇజ్రాయిల్‌ యువ సైనికుడ్ని హమాస్‌ కిడ్నాప్‌ చేసింది. అతడిని విడిపించుకోవడానికి ఇజ్రాయిల్‌ అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో 2011లో హమాస్‌ ఉగ్రవాదులతో ఖైదీల మార్పిడి ఒప్పందం చేసుకొంది. కిడ్నాప్‌ జరిగిన నాలుగేళ్ల తర్వాత వెయ్యిమంది పాలస్తీనా ఖైదీలను వదిలి తమ సైనికుడిని విడిపించుకుంది. ఇప్పుడు హమాస్‌ చెరలో వందమందిదాకా ఉండటంతో, వారిలో తమ దేశానికి వచ్చిన విదేశీయులు కూడా ఉండటంతో ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేస్తూనే బందీలను రక్షించుకునేందుకు ఇజ్రాయిల్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ హమాస్‌ బందీలను అడ్డుపెట్టుకుని ఇజ్రాయిల్‌ మెడ వంచాలన్న వ్యూహంతో ఉంది.

ఆయుధాలు దాచేందుకు, నిఘా వర్గాల కన్నుగప్పి స్మగ్లింగ్‌ కార్యకలాపాలు సాగించేందుకు,తమ బందీలను మూడోకంట పడకుండా దాచేందుకు గాజా భూగర్భంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించారు హమాస్‌ ఉగ్రవాదులు. గాజా హమాస్‌ గుప్పిట్లోకి వెళ్లినప్పటినుంచీ కాంక్రీట్‌తో అండర్‌గ్రౌండ్‌ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాలతో కలిపారు. వీటి నిర్మాణాలకు బాలకార్మికులను వాడుకుంది ఉగ్రవాద సంస్థ. యుద్ధవిమానాలు, ఉపగ్రహాలకు కూడా బంకర్ల ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బంకర్లలో నీరు, విద్యుత్తు, ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. ఈజిప్ట్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌కి కూడా ఇవే రాచమార్గాలు. గాజా పట్టణంలో దాదాపు వెయ్యికి పైగా సొరంగాలున్నట్లు అంచనా. సామాన్య ప్రజలు సంచరించే ప్రదేశాల్లో వీటి ప్రవేశమార్గాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని దాడులు చేయరన్న నమ్మకంతోనే హమాస్‌ ఈ ఎత్తుగడ పన్నింది.

విచిత్రమేంటంటే ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌కి కూడా అంతుపట్టని గాజా సొరంగాల నిర్మాణానికి వాడిన మెటీరియల్‌ అంతా ఆ దేశంనుంచి వచ్చిందే కావడం. గాజాలో ఇతర నిర్మాణాల కోసం ఇజ్రాయిల్‌ పంపిన ఇసుక, గ్రావెల్‌, సిమెంట్‌, ఇనుముని హమాస్‌ అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్స్‌కి వాడినట్లు ఇజ్రాయెల్‌ రక్షణశాఖ గుర్తించింది. 2014 నాటికే దాదాపు 5వేల ట్రక్కుల మెటీరియల్‌ హమాస్‌ చేతుల్లోకి వెళ్లిందని గుర్తించేసరికే దుర్భేద్యమైన బంకర్ల నిర్మాణం జరిగిపోయింది. రెండేళ్ల క్రితం బంకర్లను టార్గెట్‌ చేసుకుని ఇజ్రాయిల్‌ దాడులు చేసినా సొరంగాల నెట్‌వర్క్‌ని ధ్వంసం చేయలేకపోయారు. కొన్ని సొరంగాలైతే 65 అడుగుల కింద ఉండటంతో వాటిని గుర్తించడం అసాధ్యమవుతోంది. దీంతో బందీలను విడిపించుకునేందుకు ఇప్పుడు ఇక ఇజ్రాయిల్‌ దళాలు ప్రతి ఇంటిని జల్లెడపడుతూ రెస్క్యూ అపరేషన్‌ నిర్వహించడం ఒక్కటే మార్గం.

Share this post

submit to reddit
scroll to top