కాంగ్రెస్‌ వచ్చింది.. కరువు తెచ్చిందా!

kcr-formers.jpg

పదేళ్లలో ఎప్పుడన్నా నీళ్లకొరత ఉందా. రెప్పపాటు కాలమైనా కరెంటు పోయిందా. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్‌తో పాటు వచ్చిన విపత్తు. బీఆర్‌ఎస్‌ నేతల నోట ఇప్పుడివే డైలాగులు. తెలంగాణలో బొక్కబోర్లా పడ్డ కేసీఆర్‌ పార్టీకి కరువు పరిస్థితులు వరంలా కలిసొచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ కరువు తెచ్చిందంటోంది బీఆర్‌ఎస్‌. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనే దీనికి కారణమని అధికార కాంగ్రెస్‌ కౌంటరిస్తోంది. కరెంట్‌ కష్టాలకు, నీటి కటకటకు, రైతుల కన్నీళ్లకు కారణం మీరంటే మీరేనంటూ పరస్పరం నిందించుకుంటున్నాయి రెండు పార్టీలు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతుండటంతో పంటలు ఎండుతున్నాయి. మొన్నటిదాకా ఫాంహౌస్‌ దాటని కేసీఆర్‌ పంటపొలాల్లో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కంటే ముందు ఎనిమిదేళ్లు తామిచ్చిన కరెంటు మంత్రం వేసినట్లు ఇప్పుడెలా మాయమైందని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందినచోట ఇప్పుడు మళ్లీ ఖాళీ బిందెలు ఎందుకు కనిపిస్తున్నాయని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయమంతా రైతుల చుట్టూ తిరుగుతోంది. కరువు, రుణమాఫీ, బోనస్‌లపై నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రైతాంగ సమస్యలపైనే పొలంబాట, దీక్షలు చేస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, రైతులను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. మరోవైపు రైతులకు భరోసాగా ఉండేందుకు కాంగ్రెస్‌ ప్రకటించిన మూడు కీలక హామీలను వానా కాలం నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

 

Share this post

submit to reddit
scroll to top