డౌటేముందీ ఇవి సెమీఫైనల్సే!

electioncomission.jpg

ఆర్నెల్లలో ఫైనల్స్‌. వచ్చే నెల్లో సెమీఫైనల్స్‌. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ పచ్చజెండా ఊపేసింది. ఐదు రాష్ట్రాల్లోకెల్లా రాజకీయంగా హాట్‌హాట్‌గా ఉన్న రాష్ట్రమేదంటే అది తెలంగాణనే. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది ఎన్నికల సంఘం. నవంబరు 3న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్‌ విడుదల తర్వాత నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో శాంతిభద్రతల దృష్ట్యా రెండుదశల్లో పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. మిజోరంలో నవంబర్‌ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 23న జరుగుతాయి. చివరిగా తెలంగాణ ఎన్నికలు నవంబరు 30న జరుగుతాయి. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరుగుతుంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్‌గా చెప్పొచ్చు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మిగతా నాలుగు రాష్ట్రాలూ ఒక ఎత్తయితే.. తెలంగాణ మరో ఎత్తు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో పాగా వేయాలనుకుంటోంది. అటు బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్ కొడతానంటోంది. కర్నాటక ఫలితాల తర్వాత జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి గెలిచేది నేనేనంటోంది. కోడ్‌ అమలులోకి రావటంతో ఇక పార్టీలు ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాల్సిందే. ఈసారి ఎన్నికలకు సంబంధించి నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ గతంలోలాగా పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు కాకుండా కనీసం ఐదు రోజుల ముందు అందించే ప్రయత్నం చేస్తామంటోంది ఈసీ.

అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఈసారి ఈసీ ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రారంభించింది. నామినేషన్‌ పత్రాన్ని ఆన్‌లైన్‌లో నింపి, ఆ ప్రింట్‌ కాపీని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించవచ్చు. డిపాజిట్‌ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అంటే అట్టహాసాలకు పోకుండా చడీచప్పుడు కాకుండానే నామినేషన్‌ని సమర్పించవచ్చు. ఇక ఈక్షణంనుంచీ ఫలితాలు వెలువడేదాకా తెలంగాణాతో పాటు ఐదు రాష్ట్రాల్లో సందడేసందడి.

Share this post

submit to reddit
scroll to top