రాబోయే కాలానికి కాబోయే సీఎంలు!

revanthreddy-with-komatireddy.jpg

ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు అదేదో అన్నట్లే ఉంది కాంగ్రెస్‌ పరిస్థితి. కాంగ్రెస్‌ అధికారంలోకి రానేలేదు. అప్పుడు సీఎం పదవిపై ఆ పార్టీ నేతలు మనసు పారేసుకుంటున్నారు. కడుపులో ఉంది కక్కేస్తున్నారు. రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, వెంకటరెడ్డి, భట్టివిక్రమార్క చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌నుంచి ఓ అరడజనుమంది సీఎంలున్నారు. కొందరు ఉత్సాహవంతులు రేవంత్‌రెడ్డి డిసెంబరు 9న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పేస్తున్నారు.

పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే రేవంత్‌రెడ్డి సీఎం అవుతారేమోనన్న భయం పార్టీనేతల్లోనే కాదు ఆయన రాజకీయ ప్రత్యర్థుల్లో కూడా ఉన్నట్లుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రేవంత్‌ చేతికి అధికారదండం వెళ్తే అమ్మో ఇంకేమన్నా ఉందా అన్న ఆందోళన అప్పుడే మొదలైంది. అందుకే రేవంత్‌కి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే స్టేట్మెంట్లు వచ్చేస్తున్నాయి. బీజేపీ నేత బండి సంజయ్‌, కాంగ్రెస్‌కి బేషరతు మద్దతిచ్చిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇద్దరూ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిపై ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా రేవంత్‌రెడ్డిని మాత్రం సీఎంని చేయొద్దని అన్యాపదేశంగా చెప్పేశారు.

బీఆర్‌ఎస్‌ గెలిస్తే కేసీఆరే సీఎం. మనసు మారితే ఆయన తనయుడు కేటీఆర్‌కి ఛాన్స్‌. తాము అధికారంలోకొస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ కాంగ్రెస్‌లో ఆ క్లారిటీ లేదు. అందుకే కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ తొందరపడి కోయిల ముందే కూసినట్లు సీనియర్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. రేవంత్‌ని సీఎంని చేస్తే తాము కాంగ్రెస్‌కి ఓట్లు వేయమని ముస్లింలు చెప్పారట. బండి సంజయ్‌కి ఈ రహస్యం ఎలా తెలిసిందోగానీ ఆయనే పనిగట్టుకుని చెబుతున్నారీ మాట. ఇక వైఎస్‌ షర్మిల అయితే రేవంత్‌ని డ్యామేజ్‌ చేసేలా మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని సుప్రీంకోర్టే దొంగ అనేసిందని షర్మిల ఇప్పుడు గుర్తుచేయడం వెనుక ఆమె ఆలోచన అర్ధమవుతుంది.

పరోక్షంగా రేవంత్‌రెడ్డిని దొంగ అంటూనే తెలంగాణ రాష్ట్రానికి ఒక దొంగను మాత్రం ముఖ్యమంత్రిని చేయొద్దని వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కి సలహా ఇచ్చారు. తనకు సీటు లేకుండా చేసిన రేవంత్‌మీద ఆమె అసహనంతో ఉన్నా.. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా తెరవెనుక చాలా తతంగం జరుగుతోందన్న మాటయితే వాస్తవం. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్న కన్‌ఫ్యూజనే ఇతర పార్టీలకు ఆయుధంగా మారింది. మీ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పండని టార్గెట్ చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. దీన్ని వీలైనంత డైవర్ట్‌ చేయాల్సిన కాంగ్రెస్‌ నేతలు కూడా కడుపుబ్బరం ఆపుకోలేకపోతున్నారు.

Share this post

submit to reddit
scroll to top