మోడీ నోట భయంకర ‘రహస్యాలు’!

prime-minister-modi-criticise-kcr-at-nizamabad-meeting.jpg

అవినీతి. కుటుంబపాలన. ఇప్పటిదాకా కేసీఆర్‌మీద మోడీ వ్యాఖ్యలు అంతకుమించి ముందుకెళ్లలేదు. బీజేపీ పెద్దల విమర్శలు మల్లెచెండుతో కొట్టినట్లు సుకుమారంగా దెబ్బ తగిలీ తగలనట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్‌. బయటేమో బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒకే తాను ముక్కలన్న ప్రచారం బలంగా ఉంది. సొంత పార్టీశ్రేణులకే ఆ అనుమానమొస్తోంది. లిక్కర్‌స్కామ్‌లో కవిత అరెస్ట్‌ కాకపోవటంతో ఆ రెండుపార్టీల బంధంపై విపక్షపార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయ్‌. దీంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అందుకే మా మధ్య మీరనుకుంటున్నట్లు ఏమీలేదు. మీ దగ్గర దాచడానికేమీ లేదు. ఇదిగో రహస్యాల మూట మీ ముందే విప్పుతున్నా అంటూ నిజామాబాద్‌ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్రమోడీ.

కేసీఆర్‌ కేంద్రప్రభుత్వంతో కాళ్లబేరానికి వచ్చారు. నిజమా? అబద్ధమా? చెప్పింది స్వయంగా మోడీకాబట్టి పచ్చి అబద్ధమని కొట్టిపారేయడం బాగోదు. చిన్నాచితకా పార్టీలనే చంకకెక్కించుకున్న ఎన్డీఏ పెద్దలు కేసీఆర్‌ని పోపోవోయ్‌ అన్నారట! ఎన్డీయేలో చేరతామని, కేటీఆర్‌ని ఆశీర్వదించమని కేసీఆర్‌ రెండుచేతులూ పట్టుకుని అర్థిస్తే.. ఏమనుకుంటున్నావ్‌ నువ్వు ఇదేమన్నా రాజరికమా అని ప్రధాని హూంకరించారు. చూసినోళ్లెవరూ లేరు.. ఎందుకంటే అక్కడుంది ఆ ఇద్దరే. జరిగిందని మోడీనే చెబుతున్నారు మరి. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుంటే సరిపోతుంది. మోడీగారి ఆశీర్వచనాల అవసరమేముందో. రాజ్యాంగంలో చడీచప్పుడు కాకుండా అలాంటి సవరణేదన్నా చేశారా ఏంటి కొంపదీసి?

సున్నితమైన గుండెలేమన్నా ఆ సభాప్రాంగణంలో ఉండిఉంటే ఇన్ని నిజాలు విని తట్టుకోలేక ఆగిపోయేవేమో. అదృష్టవశాత్తూ అలాంటి ఉపద్రవాలేమీ జరగలేదు. మోడీ కేసీఆర్‌ని నాలుగు మాటలంటే చెవులారా విందామనుకున్న తెలంగాణ బీజేపీ నేతలకైతే నిజామాబాద్‌ జనగర్జన మీటింగ్‌తో ఆ కరువు తీరిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీకెళ్లి మోడీని కలిశారు. అయితే మీతో పొత్తు పెట్టుకునే ముచ్చటే లేదని మోడీసాబ్‌ కేసీఆర్‌ మొహానే చెప్పేశారు. ఇప్పటిదాకా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని మీటింగ్‌లో ప్రధాని పబ్లిక్‌ సాక్షిగా చెప్పేశారు. కేసీఆర్‌ మోడీమీద అంత ప్రేమ ఎప్పుడూ ఒలకబోయలేదు. మీరు లేక నేను లేనని డ్యూయెట్‌ పాడారో.. మోడీ మొహాన్ని చూస్తూ పరవశంతో అలాగే స్థాణువై నిల్చుండిపోయారో. కానీ నిగ్రహానికి నిలువెత్తు విగ్రహంలాంటి మోడీ ఆ కవ్వింపులకు చలించలేదు. కేసీఆర్‌ మాయలో పడిపోలేదు. ఎంత తట్టుకోలేని రహస్యం అంటే.. మేయర్‌ ఎన్నికల్లో మద్దతివ్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకెళ్లి ప్రధానిని అడగడమేంటో! ఆయన విపక్షంలోనైనా కూర్చుంటాంకానీ నీతో చేయికలిపేది లేదని అంత కరాఖండిగా చెప్పేయడమేంటో! ఏవిటో!!

నిజామాబాద్‌లో పసుపుబోర్డుని రెండ్రోజులముందే మహబూబ్‌నగర్‌లో ప్రకటించడం వ్యూహాత్మకం. ఇందూరులో అడుగుపెట్టడానికి ముందే గ్రౌండ్‌ రెడీ కావాలన్న ఆలోచన. కేసీఆర్‌ కూతురు కవిత నిజామాబాద్‌ కేంద్రంగానే రాజకీయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆమెను బీజేపీనే ఓడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు ఇదే నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డినుంచి కేసీఆర్‌ పోటీచేయబోతున్నారు. లిక్కర్‌స్కామ్‌లో పెద్దపెద్ద తలకాయలు అరెస్టయినా ఇప్పటిదాకా బీజేపీ కవిత జోలికెళ్లలేదు. అభియోగపత్రాల్లో ఆమె పేరు ప్రస్తావిస్తున్నా అరెస్ట్‌దాకా రాకపోవడంపై ఎన్నో అనుమానాలున్నాయి. అవన్నీ ఒక్కదెబ్బతో పటాపంచలు చేయాలనుకున్నారు శ్రీమాన్‌ మోడీజీ. ఢిల్లీ రాజకీయాన్ని గల్లీలోకి ఎలా తీసుకురావాలో ఆయనకి వెన్నతోపెట్టిన విద్య. అందుకే అన్నేసి రహస్యాలను ఇక్కడ బహిరంగంగా చెప్పేశారు. ఈ దెబ్బతో బీఆర్‌ఎస్‌తో బీజేపీకి ఎలాంటి లాలూచీ లేదని జనమంతా నమ్మేయాల్సిందే!

కేసీఆర్‌ భజనకు నేను పడిపోలేదు. నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కి లేదు. నా నీడను కూడా చూడలేరు. తెలంగాణలో అధికారంలోకొస్తే కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలిపెట్టం. అవినీతిని బట్టబయలుచేస్తాం. ఇలా ఎన్ని పంచ్‌ డైలాగులో. కేసీఆర్‌ కుటుంబం అంత దారుణంగా రాష్ట్రాన్ని దోచుకుంటే, అక్రమాలకు సాక్ష్యాలుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా ఆగాలా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, చీమచిటుక్కుమన్నా ఐటీ, ఈడీలను రంగంలోకి దించే కేంద్రాన్ని ముందుకెళ్లకుండా ఆపిందెవరో.. ఆపుతున్నదెవరో? ఇంతకీ కేసీఆర్‌ ఎన్డీఏలో కలుస్తామన్నారా? తెలంగాణలో అధికారాన్ని పంచుకుందామని బీజేపీ పెద్దలే సెలవిచ్చారా? బేరసారాలు, చర్చలు కొలిక్కిరాకనే ఇన్ని ‘రహస్యాలు’ ఇప్పుడు బయటికొస్తున్నాయా? ఇంకో ధర్మసందేహం. ఎప్పుడో జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఇన్ని గుండెలు పగిలే సంఘటనలు జరిగితే.. ఇంత ఆలస్యంగా ఇప్పుడే ఇందుకు బయటికొస్తున్నాయో? మధ్యలో మోడీ, ఆయన కుడిభుజం అమిత్ షా ఎన్నిసార్లు రాలేదు. అప్పుడెందుకు ఈ నిజాలు బయటపెట్టలేదు. దేనికైనా టైం రావాలి కదూ..అవునవును ఆ ఎన్నికల టైం ఇప్పుడొచ్చింది మరి!

Share this post

submit to reddit
scroll to top