హేతువాద గడ్డపై హిందూత్వనాదం!

annamalai-modi.jpg

ద్రవిడ పార్టీల అడ్డా తమిళనాడులో పాగావేసే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ. తమిళనాట ద్రవిడ పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు మనుగడ అసాధ్యమనే వాదన తప్పని నిరూపించే ప్రయత్నాల్లో ఆ పార్టీ ఉంది. మోదీ- అన్నామలై కాంబినేషన్‌లో తమిళనాడులో బీజేపీ ఈసారి సత్తాచాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్‌ షేర్‌ పెంచుకోవడంతో పాటు డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలుచుకునేలా కమలనాథులు దూసుకుపోతున్నారు. బీజేపీ కూటమి నుంచి తమిళనాట ఇలాంటి సవాలును ఊహించని పార్టీలు అప్రమత్తమయ్యాయి.

తమిళ రాజకీయాలనగానే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల గురించే అంతా మాట్లాడుతుంటారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉండగా ప్రతిపక్ష అన్నాడిఎంకే కంటే ఇప్పుడు బీజేపీ ప్రస్తావనే ఎక్కువగా వినిపిస్తోంది. గత ఏడాది మార్చిలో బీజేపీతో, సెప్టెంబర్‌లో ఎన్డీయేతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. దీంతో ఏడునెలల్లోనే 234 నియోజకవర్గాల్లో తన యాత్రతో కమలం గుర్తును రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్‌ చేశారు తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై. ఐపీఎస్‌ అధికారిగా రాజీనామా చేసి పార్టీ పగ్గాలు స్వీకరించాక తమిళులకు బీజేపీని దగ్గర చేశారాయన.

ద్రవిడ పార్టీల అత్యుత్సాహం బీజేపీ బలం పెంచుతోంది. సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలని ఎండగట్టి డీఎంకేని ఇరకాటంలో పడేసింది బీజేపీ. ద్రవిడవాదం నుంచి తమిళ యువతను క్రమంగా హిందుత్వ వాదంవైపు తీసుకెళ్లడంలో అన్నామలై కొంత విజయం సాధించినట్లే కనిపిస్తోంది. ఎన్నికలకు కొంతకాలం ముందే గట్టి ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసిన బీజేపీ తమిళనాట ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌గా మారింది. ద్రవిడ వాదం, హేతువాదం బలంగా వినిపించే పార్టీలు అధికారాన్ని ఏలుతున్న తమిళనాడులో బీజేపీ కూటమి ఈసారి సంచలనం సృష్టించేలా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడవాదం డామినేట్‌ చేస్తుండగా లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి హిందుత్వం హైలైట్‌ కాబోతోంది. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇపుడు బీజేపీతో కలిశారు. ఓపిఎస్ వర్గం పూర్తిగా బీజేపీకి సపోర్ట్‌గా నిలవడం తమిళనాట ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. కూటమిగా మొత్తం 39 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ సొంతంగా 23 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 3.66 శాతం ఓటుషేర్ కలిగిన బీజేపీకి ఈసారి 20 శాతం ఓట్‌ షేర్‌ దక్కొచ్చనే అంచనాలున్నాయి. అన్నాడీఎంకే ఓటుబ్యాంక్‌ బీజేపీ కూటమి వైపు టర్న్‌ కాబోతోందని విశ్లేషకుల అంచనా. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలనుకుంటున్నారు అన్నామలై.

Share this post

submit to reddit
scroll to top