తెలంగాణలో అసెంబ్లీ దంగల్ ముగిసి, ఆ వేడి చల్లారక ముందే లాంగ్ జంపుల సీజన్ మొదలైనట్లే ఉంది. కాంగ్రెస్ నుంచి కన్నుగీటడాలు మొదలయ్యాయో లేదో గానీ.. ఎగిరిపోతే ఎంత బావుంటుందంటూ కొన్ని శాల్తీలు సీన్‌లోకొచ్చేశాయి. 30 మంది టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటే.. ఆల్రెడీ 12 మందిని బుజ్జగిస్తున్నట్టు బీఆర్‌ఎస్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. మెదక్ జిల్లాకు చెందిన ఆ నలుగురితో మొదలైన రచ్చ చివరాఖరికి ఏ మలుపు తిరుగుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాటామంతీ పేరుతో బైటికొచ్చిన ఆ నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటో తాలూకు రచ్చ ఇంకా చల్లారనే లేదు. గులాబీ పార్టీని వంద అడుగుల లోతుకు బొంద పెడతామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన వార్నింగ్ రీసౌండ్ ఇస్తుండగానే.. ఇలా యాక్షన్ మొదలుకావడం తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోంది.
బీజేపీకి టెన్షనేమీ లేదు. మొన్నటిదాకా ఎగిరెగిరి పడ్డ బీఆర్ఎస్ పార్టీనే దినదినగండంలా గడపాల్సి వస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఫ్లవర్ బొకే ఇచ్చొచ్చిన ఆ నలుగురూ గులాబీ పార్టీ హార్డ్‌కోర్ నాయకులే. మొన్నటిదాకా ఎంపీగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు. కేసీఆర్, కేటీఆర్‌లకి సన్నిహితులు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని మరీ టికెట్ ఇచ్చారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుకి కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. వీటన్నిటికీ మించి.. హరీష్ రావుకు మంచి గ్రిప్ ఉన్న మెదక్ జిల్లా నుంచే నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది. పుకార్లు సృష్టించకండి.. మాకు పార్టీ మారే ఆలోచనే లేదని నలుగురూ వివరణలు ఇచ్చారే తప్ప.. కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. అందుకే ఆ నలుగురి సంజాయిషీ బీఆర్‌ఎస్ కేడర్‌ని సంతృప్తి పరిచలేదు.
నలుగురు ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలు అందరికీ ఉన్నవే. ఆ కారణమే నిజమైతే.. పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకుని అంతా కలిసి వెళ్లుంటే ఆ లెక్క వేరుగా ఉండేది. నలుగురే ఒక జట్టుగా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకోవడం పార్టీ ఆత్మస్థైరాన్ని ఎంతో కొంత దెబ్బతీసే పరిణామమే. లోక్‌సభ ఎన్నికల దంగల్‌కి కౌంట్‌డౌన్ మొదలైన సమయంలో ఇలా జరగడంతో డిఫెన్స్‌లో పడింది బీఆర్‌ఎస్ పార్టీ. ఇదే గ్యాప్‌లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఉంది. నాలుగుతో మొదలైన లెక్క అక్కడే ఆగదు. అది నలభైకి చేరినా ఆశ్చర్యం లేదు అంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ ఉనికే ప్రశ్నార్థకం కాబోతోందంటున్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మేం గేట్లు తెరిస్తే కారు పార్టీ ఖాళీ కావడం పక్కా అనేది మరో మంత్రి తుమ్మల ధీమా.
కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య గేమ్‌షోలో థర్డ్ అంపైరింగ్ చేస్తోంది బీజేపీ. ఇది టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ బీఆర్‌ఎస్‌పై ర్యాగింగ్ మొదలుపెట్టారు కమలనాథులు. హరీష్‌రావు ఇచ్చిన సిగ్నల్‌తోనే ఆ నలుగురూ రేవంత్‌ని కలిశారంటున్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ కూతురు కవిత మెదక్ ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారని, అదేమాత్రం ఇష్టంలేని హరీష్‌రావు తన జిల్లా ఎమ్మెల్యేలతో కౌంటర్ గేమ్ మొదలు పెట్టారని బీజేపీ చెబుతోంది. మొత్తం 30 మంది మాతో టచ్‌లో ఉన్నారు… చిటికేస్తే చాలు లోక్‌సభ ఎన్నికల ముందే హస్తం గూటికి చేరిపోతారు అంటూ హాట్ స్టేట్‌మెంట్స్‌తో బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ నేతలు హీట్ పుట్టిస్తున్నారు. బీఆర్‌ఎస్ మొత్తం స్కోరే 39. అందులో 30 మైనస్ ఐతే.. పరిస్థితేంటి? కానీ అదంతా ఊహాతీతం. కానీ అంతదూరం రాకముందే కేసీఆర్ పార్టీ జాగ్రత్తపడుతోంది. గోడదూకే ఛాన్స్ ఉందనుకుంటున్న 12 మంది ఎమ్మెల్యేల లిస్ట్ రెడీచేసి స్పెషల్‌గా నజర్ పెట్టింది. పరోక్షంగా బుజ్జగింపుల పర్వం కూడా మొదలుపెట్టేసిందని భోగట్టా.
ప్రభుత్వాలు మారగానే ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు మారడం క్వైట్ నాచురల్. ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు ఓరకంట చూడటం.. చూపులు కలవగానే కండువాలు మార్చుకోవడం కామన్. గతంలో కాంగ్రెస్ నుంచి డజన్ల కొద్దీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరిన ఎగ్జాంపుల్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందా.. లేదంటే ప్రధాని మోడీని కలిసిన రేవంత్‌రెడ్డిలాగే తెలంగాణలో కూడా కేవలం అభివృద్ధే ప్రాతిపదికన కలయికలు జరిగినట్టు భావించాలా అన్న చర్చ కూడా ఉంది. ఒక్కటి మాత్రం నిజం కాంగ్రెస్ ఎంతోకాలం అధికారంలో ఉండదని రంకెలేస్తున్న బీఆర్ఎస్ తన వీపు వెనుక ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందే. కనకపు సింహాసనమున.. అంటూ చెప్పడానికి సామెతలు బాగానే ఉంటాయికానీ బలవంతుడైన సర్పము చలిచీమల చేతచిక్కితే ఏమవుతుందన్న సామెతను కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడితేనే గులాబీపార్టీ ఒంటికి, ఇంటికి మంచిది!